Hyderabad Man Died at Chicago : హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన అక్షిత్‌రెడ్డి అనే యువకుడు అమెరికాలోని చికాగోలో ఈతకు వెళ్లి మృతి చెందారు. జులై 21వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతని మృతదేహం జులై 27న రాత్రి హైదరాబాద్‌కు చేరుకోగా ఆదివారం(28న) ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్‌రెడ్డి, సమంత దంపతులు 25 ఏళ్ల క్రితం కాటేదాన్‌కు వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అక్షిత్‌రెడ్డి (26) ఉన్నారు. గోపాల్‌రెడ్డి డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేయగా కుమారుడిని ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితమే అమెరికా పంపించారు.
చెరువులో ఉన్న రాయి వద్దకు వెళ్లాలని : అక్షిత్ రెడ్డి అమెరికాలోని చికాగోలో ఉంటూ ఎమ్మెస్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు. రెండు నెలల్లో అక్షిత్ ఇండియాకు రావాలని ప్లాన్ చేసుకున్నారు. భారత్‌కు వచ్చిన తర్వాత తమ కుమారుడికి డిసెంబరులో పెళ్లి చేయాలని తండ్రి గోపాల్ రెడ్డి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్షిత్ రెడ్డి జులై 21వ తేదీన సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి చికాగోలోని లేక్‌మిశిగన్‌లో ఈతకు వెళ్లారు.
ఒక స్నేహితుడు ఒడ్డున ఉండగా మరో ఫ్రెండ్‌తో కలిసి అక్షిత్ చెరువులోకి దిగారు. ఈ నేపథ్యంలో చెరువు మధ్యలో ఉన్న ఓ రాయి వద్దకు వెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. అతి కష్టం మీద రాయి వరకు స్నేహితుడు చేరుకోగా అక్షిత్ రెడ్డి మధ్యలోనే అలిసిపోయాడు. తిరిగి వెనక్కి వస్తున్న క్రమంలో చెరువులో మునిపోయారు. స్నేహితుడు సైతం తిరిగి వచ్చే క్రమంలో చెరువులో మునిగిపోగా గమనించిన స్థానికులు అతన్ని కాపాడారు. వెంటనే పోలీసులు గాలించి అక్షిత్ రెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. జులై 27న రాత్రి అక్షిత్‌రెడ్డి మృతదేహం కాటేదాన్‌కు చేరుకోగా 28న అడ్డాకులలో అంత్యక్రియలు పూర్తిచేశారు.