Jalamandali review on Drinking Water : రాష్ట్ర రాజధానిలో తాగునీటి సరఫరాపై విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. నగర పౌరుల గొంతెండకుండా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. నగర ప్రజలకు తాగునీటి సరఫరా చేయడంలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు జలమండలి(Jalamandali) ద్వారా నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం, నగరంలో నీటి సరఫరా తీరు, జలాశయాల్లో నీటి మట్టాలు, అత్యవసర సరఫరాకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీర, కృష్ణా ఫేజ్ 1, 2, 3, గోదావరి ఫేజ్-1 ద్వారా తాగునీరు సరఫరా జరుగుతోంది. వాటిలో నుంచి ప్రస్తుతం 2 వేల 559 ఎంఎల్డీల నీటిని సేకరిస్తున్న జలమండలి, జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో 1082.62 ఎంఎల్డీలు, జీహెచ్ఎంసీ అవతలి ప్రాంతాలకు 1049.58 ఎంఎల్డీలు, ఓఆర్ఆర్ వరకు ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలు, గ్రేటెడ్ కమ్యునిటీలు, కాలనీలకు 277.21 ఎంఎల్డీలు, మిషన్ భగీరథకు 149.47 ఎంఎల్డీల నీటిని సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Hyderabad Water Board : అలాగే హైదరాబాద్ సమీపంలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో సమృద్ధిగా నీటి లభ్యత ఉందని, వాటి నుంచి 24 ఎంఎల్డీల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నామని పేర్కొంది. వచ్చే నెలలో 40 ఎంల్‌డీల వరకు జంట జలాశయాల నుంచి సేకరించేందుకు జలమండలి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది. గతేడాది ఏప్రిల్ 3 నాటికి 2270 ఎంఎల్డీల నీటి సరఫరా జరిగితే ఈ ఏడాది ఏప్రిల్ 3 నాటికి 2409.53 ఎంఎల్డీల నీటిని సరఫరా చేస్తున్నామని వివరించింది.
గతంతో పోల్చితే అదనంగా మరో 139.53 ఎంఎల్డీ నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. నాగార్జున సాగర్‌లో(Nagarjuna sagar) హైదరాబాద్‌లో తాగునీటి అవసరాల కోసం వచ్చే 4 నెలలకుగాను 5.60 టీఎంసీల నీరు అవసరం ఉందని అంచనా. ఈ లెక్కన సాగర్‌లో 136.47 టీఎంసీల నీరు ఉంది. 131.66 టీఎంసీల వరకు డెడ్ స్టోరేజీ లభ్యత ఉంది. అయినా సరే అందులో 4.81 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉంది.
అలాగే ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో నగర తాగునీటి అవసరాల కోసం వచ్చే 4 నెలలకు 3.33 టీఎంసీల నీరు అవసరం ఉండగా, ప్రస్తుతం 7.71 టీఎంసీల నీరు రిజర్వాయర్‌లో అందుబాటులో ఉంది. డెడ్ స్టోరేజీ 3.31 టీఎంసీల వరకు వెళ్లినా నీటి లభ్యత ఉండనుంది. అందులో 4.40 టీఎంసీల నీటిని నగరానికి సరఫరా చేసుకోవచ్చని జల మండలి ప్రభుత్వానికి సూచించింది.
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేసిన అధికారులు - Sagar water release for Left Canal