Hyderabad to Yadagirigutta Tour Package: సమ్మర్ హాలీడేస్‌లో చాలా మంది ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి దేవాలయాలను దర్శించకోవాలనుకుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్‌లో ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీని చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఒక్కరోజులోనే ఈ టూర్ పూర్తి కానుంది. మరి ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ టూరిజం.. "యాదగిరిగుట్ట ప్యాకేజీ టూర్" (YADAGIRIGUTTA PACKAGE TOUR) పేరుతో ఈ టూర్‌ను ప్లాన్ చేసింది. ఈ టూర్‌లో ప్రయాణం మొత్తం ఏసీ మినీ బస్‌లో ఉంటుంది. ప్రతీ శనివారం ఈ టూర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ ఒక్కరోజు టూర్‌లో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనంతో పాటు, కొలనుపాకలోని జైన మందిరం, సురేంద్రపురి వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. మరి ప్రయాణం, ధర వివరాలు చూస్తే..
టూర్ ఇలా :
- ఉదయం 9 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ కార్యాలయం నుంచి బస్సు జర్నీ స్టార్ట్ అవుతుంది.
- 10:30 గంటలకు మీరు కొలనుపాకకు చేరుకుంటారు. అక్కడ పురాతనమైన జైన ఆలయాన్ని సందర్శిస్తారు.
- తర్వాత 11:30 గంటలకు కొలనుపాక నుంచి యాదగిరిగుట్టకు బయలుదేరుతారు.
- 12:30 గంటలకు యాదగిరిగుట్ట చేరుకుని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
- తర్వాత 1:30 నుంచి 2:00 గంటల వరకు హరిత హోటల్‌లో భోజనం ఉంటుంది.
- యాదాద్రి నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 4:30 గంటలకు సురేంద్రపురికి వెళ్తారు.
- సురేంద్రపురిలోని కుందా సత్యనారాయణ కళాధామం సందర్శించిన తర్వాత రాత్రి 7:30 గంటలకు సురేంద్రపురి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
- రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ పూర్తవుతుంది.
టికెట్ ధర : ఈ ఒక్కరోజు యాదగిరిగుట్ట టూర్ ప్యాకేజీ కోసం పెద్దలకు రూ.1499, పిల్లలకు రూ.1199లను టికెట్ ధరగా నిర్ణయించారు. అయితే ఈ ప్యాకేజీలో దర్శనం, ఎంట్రీ టికెట్స్, ఫుడ్ వంటివి కవర్ కావు. వీటి ఖర్చును పర్యాటకులే భరించాల్సి ఉంటుంది. యాదగిరిగుట్ట ప్యాకేజీ టూర్ మరిన్ని వివరాల కోసం లేదా బుకింగ్ చేసుకోవాలనుకునే వారు https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు.