Hyderabad Software Engineers Attacked on Police : శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్రే కీలకం. విధి నిర్వహణలో ఎంతో క్లిష్టమైన బాధ్యతలు చేపడతారు. శాంతిభద్రతల విషయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసేది వారే. అలాంటి పోలీసులకే రక్షణ లేకుండా పోతుంది.
24 గంటలు ప్రజల కోసం పనిచేస్తూ ఎక్కడ ఏం జరిగినా ఫోన్ కొడితే చాలు నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి చక్కదిద్దుతారు. అలాంటిది పోలీసులపైనే దాడులు చేస్తున్నారు కొందరు అల్లరి మూకలు. ఇలా ప్రజల కోసం పనిచేసే పోలీసులపై దాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షలు వేయాలి. తాజాగా మద్యం మత్తులో ముగ్గురు యువకులు పోలీసులపై దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం : శాలివాహన నగర్‌లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజు, హోం గార్డ్ శేఖర్.. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు రోడ్డుపై గొడవ చేస్తుండటాన్ని గమనించారు. అక్కడ వారిని ఆపి ఇంటికి వెళ్లాలని సూచించగా ఒక్కసారిగా యువకులు రెచ్చిపోయారు. పోలీసులు అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డారు. వాహనంపై ఉన్న పోలీసులను కిందకు లాగి తీవ్రంగా కొట్టారు. వారిపై బూతులు తిడుతూ మద్యం మత్తులో చెలరేగిపోయారు.
మద్యం మత్తులో పోలీసులపై దాడి : పోలీసులు ఎంత చెప్పిన వినకుండా దాడి చేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ముగ్గురు యువకులు పారిపోయారు. బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. దాడి చేసిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని డీజే కార్తీక్, సాప్ట్‌వేర్ ఇంజినీర్లు అశోక్, మోహన్‌లుగా గుర్తించారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు పోలీసులపై ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. గతంలో పాతబస్తీకే పరిమితమైన దాడులు ఇప్పుడు నగరంలోని పలు ప్రాంతాల్లోనూ చోటు చేసుకుంటున్నాయి.
మంచిర్యాల జిల్లాలో పోలీసులపై బీఆర్ఎస్ సర్పంచ్ అనుచరుల దాడి