Shalibanda Police Station Best PS in India 2024 : హైదరాబాద్ నగరం పేరు కేంద్రంలో మరోసారి మెరిసింది. కేంద్ర హోంశాఖ తాజాగా వెల్లడించిన ఉత్తమ ఠాణాల ర్యాంకింగ్‌లో శాలిబండ పోలీస్ స్టేషన్ దేశంలో 8వ స్థానం దక్కించుకొని ఆదర్శంగా నిలుస్తోంది. 2024కు గానూ దేశంలో స్టేషన్‌లోని పని తీరు, పరిసరాల పరిశుభ్రతతో పాటు పలు విభాగాల్లో పరిశీలించి ఠాణాలకు అవార్డులను కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
శాలిబండ పీఎస్‌కు జాతీయ స్థాయి గుర్తింపు : వివిధ అంశాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ప్రతి రాష్ట్రం నుంచి కేంద్ర హోంశాఖ ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శాలిబండ పోలీస్ స్టేషన్‌ను ఎంపిక చేశారు. శాలిబండ పోలీస్ స్టేషన్‌లో హౌస్ ఆఫీసర్, ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లతో సహా దాదాపు 60 మంది సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు. పాతబస్తీ అంటే మత ఘర్షణలు ఉంటాయనే పేరున్నా, సౌత్ జోన్ డీసీపీ పరిధిలో సున్నితమైన పోలీస్ స్టేషన్‌లలో శాలిబండ ఒకటిగా ఉంటుంది. ఠాణా పరిధిలో మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలను కాపాడుతున్నారు. ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో పాటు త్వరగా నిందితులపై ఛార్జ్ షీట్‌లు దాఖలు చేయడం, మాదక ద్రవ్యాల కేసుల వంటివి నమోదు చేస్తున్నారు.
కేసులపై నిరంతరం దృష్టి పెట్టడం : సీసీటీఎన్ఎఫ్లో డేటాను అప్‌లోడ్ చేయడం, పాత కేసులపైనా నిరంతరం దృష్టి పెట్టడం, పాస్‌పోర్ట్ ధృవీకరణ దర్యాప్తు వేగవంతం చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు సాధించడం పట్ల స్టేషన్ సిబ్బందిని డీజీపీ జితేందర్ ఎక్స్ వేదికగా అభినందించారు. రెండు నెలల క్రితం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిబ్బంది పోలీసు స్టేషన్‌ను సందర్శించి వివిధ అంశాలను పరిశీలించారని సీఐ రవికుమార్ తెలిపారు. పోలీస్ స్టేషన్కు అవార్డు లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని, రానున్న రోజుల్లో తాను పని చేసే స్థానంలో దేశంలోనే ప్రథమ స్థానానికి చేరుకునేలా కష్టపడి కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని రిసెప్షన్ వ్యవస్థను ప్రతి ఠాణాలో ప్రవేశపట్టడంతో మంచి ఫలితాలను ఇస్తోంది. ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు ఆందోళనతో వచ్చే వారితో మాట్లాడి ప్రశాంతపరిచి గౌరవ మర్యాదగా ప్రవర్తించి ఫిర్యాదు చేసే వీలు కల్పించే విధంగా చర్యలను తీసుకుంటున్నామని మహిళా కానిస్టేబుల్ సరోజ తెలిపారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి విచారణ ప్రక్రియను వేగవంతం చేసి కేసులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారని ఫిర్యాదుదారులు సైతం సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.
'అసలు పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో ఏం జరుగుతోంది?'
దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్‌గా రాజేంద్రనగర్ ఠాణా - ఎందుకంత ప్రత్యేకమో తెలుసా?