Hyderabad Real Estate Development : హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే ఆకాశ హర్మ్యాలకు నిలయంగా మారుతోంది. ఇప్పటికే గచ్చిబౌలి, కొండాపూర్, నార్సింగి చుట్టుపక్కల్లో వెలిసిన భారీ అంతస్థులకు దీటుగా ఇప్పుడు కిస్మత్‌పూర్, శంషాబాద్, ఉప్పల్, పోచారం, ఘట్‌కేసర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, అబిడ్స్, పంజాగుట్ట, గుడి మల్కాపూర్‌లోనూ భారీ కట్టడాలు (Huge Buildings) వస్తున్నాయి. ఎత్తైన భవనాల్లో ముంబయి తర్వాత ఎక్కువ సంఖ్యలో ఇక్కడే కడుతున్నారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లోని బిల్డర్లకే కాదు, మెట్రో నగరాల్లోని డెవలపర్లకూ భాగ్యనగరంలోని నిర్మాణాలు అధ్యయన కేంద్రాలుగా మారాయి. సిటీలో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాల ప్రాజెక్ట్‌లు, ఉపయోగిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ, ప్రీ కాస్టింగ్ నిర్మాణాల వరకు బిల్డర్లు తెలుసుకుంటున్నారు. ఈ మేరకు క్రెడాయ్, ఎంఎస్‌ఎంఈ రెండో స్టడీ టూర్ సిటీలో శుక్రవారం నుంచి మొదలైంది. ఇది ఆదివారం వరకు జరుగుతుంది. దేశంలోని వేర్వేరు క్రెడాయ్ ఛాప్టర్ల నుంచి వచ్చిన బిల్డర్లు ఇందులో పాల్గొంటున్నారు.
CREDAI Hyderabad Study Tour : దేశ రాజధాని దిల్లీ, ముంబయి, ఛత్తీస్‌గఢ్, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఛాప్టర్ల నుంచి క్రెడాయ్, ఎంఎస్ఎంఈలకు సంబంధించిన పలువురు బిల్డర్లు స్టడీ టూర్ కోసం హైదరాబాద్ వచ్చారు. మహా నగరంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను(Real Estate Projects) ఎలా అభివృద్ధి చేస్తున్నారు, పర్యావరణపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వ్యాపార వృద్ధి కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే అంశాలు ఈ పర్యటనలో తెలుసుకుంటున్నట్లు క్రెడాయ్ ఏపీ సంయుక్త కార్యదర్శి వెలుమూరి భీమ శంకర్ రావు తెలిపారు.
కోయంబత్తూర్, బెంగళూరులో ప్రీ కాస్టింగ్‌లో నిర్మాణాలు ఇదివరకే వచ్చాయని, ఇప్పుడు హైదరాబాద్‌లో అంతకంటే అత్యాధునిక సాంకేతికతతో మైహోం సంస్థ కమర్షియల్ ప్రాజెక్ట్(Commercial Project) చేస్తోందని పేర్కొన్నారు. వారి సైట్‌కు వెళ్లి పరిశీలించిన తరవాత ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేసేందుకు, తక్కువ మంది కార్మికులతో పని చేసేందుకు ఈ సాంకేతికత వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. 1200 మంది అవసరమైన చోట ప్రీకాస్టింగ్ కారణంగా 400 మందితో మాత్రమే పని చేయిస్తున్న నిర్మాణ సాంకేతికత గురించి తెలుసుకున్నట్లు భీమశంకర్రావు వివరించారు.
స్టడీ టూర్లో భాగంగా తెల్లాపూర్‌లో సందర్శించిన 450 ఎకరాల్లో దశలవారీగా రాజపుష్ప నిర్మిస్తున్న లైఫ్‌స్టైల్ విలేజ్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఒకేచోట విల్లాలు, ఆకాశహర్మ్యాలు, ఆసుపత్రి, ఐటీ టవర్లు ఉండేలా ఒక ఊరును అభివృద్ధి చేస్తున్నారని, 50 శాతం స్థలాన్ని ఖాళీగా వదిలి పచ్చదనం పెంపొందిస్తున్న విధానం వినూత్నరీతిలో ఉందన్నారు. అనంతరం మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా వ్యాపార రంగంలో ఎలా రాణించాలో తెలిపేలా ఐఎస్‌బీలో సెషన్ నిర్వహించారు. పర్యావరణహిత భవనాలకు(Eco-Friendly Buildings) రేటింగ్ ఇచ్చే ఐజీబీసీతోనూ త్వరలోనే సమావేశం కాబోతున్నట్లు, అదేవిధంగా క్రెడాయ్ తెలంగాణ, హైదరాబాద్ సభ్యులతోనూ భేటీ ఉంటుందని వెలుమూరి భీమశంకర్రావు తెలిపారు.
అపార్ట్మెంట్/ ఫ్లాట్ కొంటున్నారా? ఈ 9 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్!