Hyderabad Metro Timings Extended : ఐపీఎల్ ప్రేక్షకులకు హైదరాబాద్ మెట్రో తీపికబురు అందించింది. ఉప్పల్ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్(IPL 2024) సందర్భంగా ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ మార్గంలో చివరి రైలు అర్థరాత్రి 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంట 10 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకుంటుందని వెల్లడించారు. ఆ సమయంలో నాగోల్, ఉప్పల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తారని, మిగతా స్టేషన్లు యథావిథిగా మూసి ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
భాగ్యనగరానికి మరో అరుదైన గౌరవం - ‘స్టాన్‌ఫర్డ్’లో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విజయగాథ
టీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు : మరోవైపు ఐపీఎల్ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు టీఎస్ ఆర్టీసీ (TSRTC) కూడా శుభవార్త చెప్పింది. ఇవాళ జరిగే ముంబయి ఇండియన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్‌కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అభిమానులకు ప్రయాణ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ మైదానానికి 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఇవి బుధవారం సాయంత్రం 6 గంటలకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రారంభమై, మ్యాచ్ అనంతరం తిరిగి రాత్రి 11.30 గంటలకు స్టేడియం నుంచి బయల్దేరుతాయని తెలిపారు. ఈ ప్రత్యేక సౌకర్యాన్ని ఉపయోగించుకొని, మ్యాచ్‌ను వీక్షించాలని క్రికెట్ అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Technical Issue in HYD Metro : హైదరాబాద్ మెట్రోరైలులో(Hyderabad Metro) సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నాగోల్ నుంచి అమీర్ పేట మీదుగా రాయదుర్గ్ కారిడార్ లో 15 నిమిషాలపాటు మెట్రో మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద 15 నిమిషాల పాటు మెట్రో రైలును నిలిపివేయడంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన మెట్రో సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించడంతో 15 నిమిషాల తర్వాత నాగోల్- రాయదుర్గ్ కారిడార్లో యధావిధిగా మెట్రో రైలు రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే ఇది సాధారణ సమస్యేనని, ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెట్రో అధికారులు వెల్లడించారు.