Goodeebag App To Prevent Plastic Usage : హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అభిషేక్ డిగ్రీ పూర్తి చేశారు. చదువుకునే సమయంలో తండ్రికి చెందిన వస్త్ర దుకాణాన్ని చూసుకునే వాడు. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం నిర్వహించాలనే ఉద్దేశంతో లాజిస్టిక్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 2022 ఫిభ్రవరిలో గూడీబ్యాగ్ అనే మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులో తీసుకొచ్చారు.
ప్లాస్టిక్ ఇస్తే పైసలు ఇస్తారు : గూగుల్ ప్లే స్టోర్‌లోని వెళ్లి గూడీబ్యాగ్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అడిగిన వివరాలు అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత గూడీబ్యాగ్ సిబ్బంది మీ ఇంటికి వచ్చి 15కేజీల బ్యాగ్ ఇస్తుంది. మీ ఇంట్లో ఉన్న ఎలాంటి వ్యర్థాలనైనా అందులో నింపి వారికి సమాచారమిస్తే సిబ్బంది ఇంటికొచ్చి వాటిని తీసుకెళ్తారు. కేవలం ప్లాస్టిక్ మాత్రమే కాకుండా ఇనుము, ఇతర ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సైతం బ్యాగులో వేయవచ్చు. గూడీ బ్యాగ్ మొబైల్ అప్లికేషన్‌లో వచ్చే ఒక్కో రివార్డు పాయింట్, ఒక రూపాయి విలువగా పరిగణించి వాటిని వినియోగించుకోవచ్చు అంటున్నారు గూడీబ్యాగ్ సీఈవో అభిషేక్.
రెండేళ్ల క్రితం ప్రారంభమైన గూడీబ్యాగ్ అప్లికేషన్ గురించి ఇప్పుడిప్పుడే ప్రచారం అవుతోంది. ఇప్పటి వరకు 3వేల మందికి పైగా ఈ అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. గతేడాది 3వేల కుటుంబాల నుంచి 4లక్షల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ ఏడాది లక్ష నుంచి 2లక్షల కుటుంబాలకు చేరువై 50లక్షల కిలోల వ్యర్థాలను సేకరించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
"ఇళ్లలో నుంచి 40 రకాలకు పైగా వ్యర్ధాలు బయటపడేస్తాం. అందులో వివిధ రకాలు ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి. వాటి గురించి అందరికి అవగాహన ఉండదు. అందుకే మేము అందరి దగ్గర వ్యర్థాలు సేకరిస్తాం. మా యాప్ ద్వారా కస్టమర్లకు బ్యాగ్ ఇస్తాం. వాళ్లు పొడి చెత్తను కలెక్ట్ చేశాక యాప్ ద్యారా మాకు సమాచారం ఇస్తే వాటిని తీసుకెళ్తాం. వారి చెత్త బరువును పట్టి రివార్డ్ ఇస్తాం." - అభిషేక్ అగర్వాల్, గూడీబ్యాగ్ సీఈఓ
ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలోని నల్లగండ్ల, బాచుపల్లి, హైటెక్ సిటీ, మణికొండ, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట ప్రాంతాల వరకు వెళ్తున్నారు. పాఠశాలల్లోని విద్యార్థులకు ప్లాస్టిక్ వ్యర్థాలు వాటిని ఓచోట జమచేసే విధానంపై అవగాహన కల్పించేలా ప్రైవేట్ పాఠశాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పర్యావరణ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్న గూడీబ్యాగ్ సంస్థ రాబోయే కొన్ని నెలల్లో హైదరాబాద్ మహానగరంలోని అన్ని ప్రాంతాల్లో సేవలందించేలా చర్యలు చేపడుతున్నారు.
దేశానికి బంగారు పతకం తేవడమే లక్ష్యంగా తైక్వాండోలో శిక్షణ ఇస్తున్న యువకుడు