Lok Sabha Election 2024 Counting Arrangements in Hyderabad : రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నిక ముగిసి దాదాపు 25 రోజులు గడుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 4న జరిగే కౌంటింగ్ మీదనే ఉంది. 17 లోక్‌సభ స్థానాలు ఒకేత్తు అయితే జంట నగరాల్లోని హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాలు ఏ పార్టీ కైవసం చేసుకుంటుందనే దానిపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అయితే ఈ జంటనగరాల ఓట్ల లెక్కింపుకు సంబంధించి రంగం సిద్ధమైంది. ఎన్ని టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తారు, ఎంతమంది సిబ్బందితో ఈ లెక్కింపును పూర్తి చేస్తారు అనేవాటిపై కసరత్తు నేడు కొలిక్కి వచ్చింది. ఇలా తయారు చేసిన ప్రణాళిక నివేదికను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు పంపించామని ఎన్నికల విభాగం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి ఓట్ల లెక్కింపు సమయంలో గొడవలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇందుకు తగిన ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అయితే ఈ జంట నగరాల్లోని పార్లమెంటు స్థానాల పరిధిలోని 3,986 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు పోలయ్యాయి. అందుకు తగ్గట్లుగా హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలోని 15 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
ఈ రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో ఏడు స్థానాలు, సికింద్రాబాద్ పరిధిలో మరో ఏడు స్థానాలు ఉన్నాయి. మిగిలినది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం. ఈ కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక జరిగింది. అయితే ఈ శాసనసభకు సంబంధించిన ఓట్లను కూడా హైదరాబాద్ జిల్లా అధికారులు లెక్కించనున్నారు. ఎంపీ విషయంలో మాత్రం ఈ నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో ఉంది. దీంతో లోక్‌సభకు సంబంధించిన ఈవీఎంలను మేడ్చల్ జిల్లా పరిధిలోని లెక్కింపు కేంద్రానికి తరలించారు.
జూబ్లీహిల్స్‌లో 20 టేబుళ్లపై లెక్కింపు : దీంతో ఈ జంట నగరాల్లోని 15 అసెంబ్లీల ఓట్లను వేర్వేరుగా లెక్కించాలని ఇప్పటికే హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉపఎన్నిక ఫలితాన్ని మాత్రం కంటోన్మెంట్ బోర్డు సీఈవోగా పర్యవేక్షణ చేయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాల పరిధిలోని రిటర్నింగ్ అధికారులు అసెంబ్లీ స్థానాల ఓట్లను రౌండ్లవారీగా తెప్పించుకుని తుది ఫలితాన్ని వెలువడిస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉండడంతో అక్కడ 20 టేబుళ్లపై కౌంటింగ్ చేయనున్నారు.
మిగిలిన 14 స్థానాల ఓట్లను 14 టేబుళ్లపై కలిపి మొత్తం 216 టేబుళ్లపై ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి తపాలా ఓట్లకు 14, సికింద్రాబాద్ తపాలా ఓట్లకు 10 కలిపి మొత్తం 24 టేబుళ్లపై లెక్కింపు చేయనున్నారు. ఈ క్రమంలో ఒక్కో టేబుల్ వద్ద ఓ సహాయకుడు, సూపర్వైజర్, మైక్రో ఆబ్జర్వర్ ఉండనున్నారు. ఈ లెక్కింపులో మొత్తం 1000 మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఈ లెక్కింపు మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు చేయనున్నారు.
తెలంగాణలో 14 సీట్లు పక్కా - లోక్‌సభ ఫలితాలపై కాంగ్రెస్ ధీమా! - TPCC ESTIMATION ON LOK SABHA RESULT
'మాకు ప్లాన్ బీ లేదు- అందుకే 400సీట్లు గెలవాలనుకుంటున్నాం'- అమిత్ షా - LOK SABHA ELECTION 2024