Hyderabad 8 Year Girl Suffering From Cancer : ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి ఎవ్వరికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ వ్యాధి బారినపడి విలవిలలాడుతోంది. తమ కుమార్తెను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే చికిత్స కోసం రూ.40 లక్షల వరకు ఖర్చుచేసి ఆర్థికంగా నలిగిపోయారు. ఇప్పుడు మరో రూ.20 లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితులో వారు ఆదుకునే చేతుల కోసం అర్థిస్తున్నారు.
హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లో ఉంటున్న ఎ.రఘు, మంజుల దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రఘు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకొని కుదుపు. మూడో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె వేదవల్లికి 2022 తీవ్ర జ్వరం వచ్చింది. వైద్యులకు చూపిస్తే మందులు ఇచ్చారు. పది రోజులు గడిచినా జ్వరం తగ్గలేదు. ఆ చిన్నారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనేక పరీక్షల అనంతరం చిన్నారికి రక్త క్యాన్సర్‌గా వైద్యులు ధ్రువీకరించారు. అయితే అది ఏ తరహా క్యాన్సర్ అనేది తెలిసేందుకు ముంబయిలోని టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
సబ్ ఇన్స్పెక్టర్గా ఏడేళ్ల బాలుడు - కలను సాకారం చేసుకున్న క్యాన్సర్ పేషెంట్
అక్కడ ఆమెకు అత్యంత అరుదైన ‘అనాప్లాస్టిక్ లార్జ్ సెల్ లింఫోమా’ నాలుగో దశలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఎక్కువగా బయటపడే ఈ వ్యాధి చిన్నారికి సోకడంతో వైద్యులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ముంబయి వైద్యుల సూచనల మేరకు వేదవల్లిని మళ్లీ హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే అత్యంత క్లిష్టమైన కీమోథెరపీ, రేడియేషన్ 5 సైకిల్స్ పూర్తిచేశారు. తర్వాత వైద్యుల సూచనలతో బోన్‌మ్యారో మార్పిడి చేశారు.
ఇప్పుడు వేదవల్లికి అధునాతన ‘కార్ టి సెల్ థెరపీ’ చేయాలని వైద్యులు సూచించినట్లు చిన్నారి తండ్రి రఘు తెలిపారు. ఇప్పటికే పాప చికిత్స కోసం తమవద్ద ఉన్నదంతా ఖర్చుచేయడంతో పాటు బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు తీసుకొని వైద్యం చేయించినట్లు చెప్పారు. ఇకముందు చికిత్సకు తన వద్ద ఏమీలేదని, ఎవరైన దాతలు తమ బిడ్డను ఆదుకోవాలని రఘు కన్నీటి పర్యంతమవుతూ అర్థిస్తున్నారు. సాయం చేయాలనుకునే దాతలు ఫోన్ నం.70326 42552ను సంప్రదించగలరు.
క్యాన్సర్‌తో కూతురు మృతి- విగ్రహంతోనే జీవిస్తున్న తల్లి! రోజూ అన్ని చెప్పుకుంటూ కన్నీరు