Husband Accuses his GHMC Officer Wife taking Bribe : ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భార్య భారీగా లంచాలు తీసుకుంటున్నట్లు ఓ భర్త సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మున్సిపల్ ఇంజినీర్‌గా పని చేస్తున్న దివ్యజ్యోతిపై ఆమె భర్త శ్రీపాద బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు. గుత్తేదారుల నుంచి ఆమె భారీ ఎత్తున లంచాలు తీసుకొంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా నోట్ల కట్టల వీడియోలను విడుదల చేశారు. రోజూ రూ.లక్షల్లో డబ్బు తీసుకొచ్చి బెడ్రూం, అల్మారాలు, పూజ గదుల్లో దాచిపెడుతున్నట్లు తెలిపారు. ప్రతి పనికి కమీషన్ కావాలంటూ గుత్తేదారులను బెదిరించి రూ.లక్షల్లో లంచం తీసుకుంటున్నట్లు చెప్పారు.
తన భార్య తీసుకున్న లంచం సొమ్మును ఫలానా చోట దాచిపెట్టిందని పేర్కొంటూ గతంలో తీసిన వీడియోలను తాజాగా సోషల్ మీడియోలో పోస్టు చేశారు. తమ ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని మణికొండలో ఓ అద్దె ఇంట్లో శ్రీపాద, దివ్యజ్యోతి ఉండేవారని, ఇటీవల నుంచే వారి మధ్య మనస్పర్థాలు ఏర్పాడ్డాయని స్థానికులు వివరించారు. ఇటీవలే దివ్యజ్యోతి వనస్థలిపురానికి మకాం మార్చారని చెప్పారు. మణికొండ డీఈఈగా పని చేసిన ఆమె ఇటీవల కాలంలోనే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు.
'నా భర్త శ్రీపాద సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలు అవాస్తవం. అతడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతోనే విడాకులు తీసుకునేందుకు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశా.' - దివ్య జ్యోతి, డీఈఈ
ఇంట్లోంచి గెంటేసింది : లంచాలు తీసుకొవద్దు అని అన్నందుకే తన భార్య తనను ఇంటి నుంచి గెంటేసిందని పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన శ్రీపాద తెలిపారు. కుమారుడిని కూడా తనకు దూరం చేసిందని పేర్కొన్నారు. తమది ప్రేమ వివాహం అని తెలిపారు. కొంతకాలంగా జగిత్యాలలో తన బంధువుల వద్ద ఉంటున్నానని చెప్పారు. తన భార్యపై చర్యలు తీసుకుని కుమారుడిని అప్పగించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మీడియాలో వచ్చిన వీడియోల ఆధారంగా ఏసీబీ ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు సమాచారం.
రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మేడ్చల్ జిల్లా సహకార బ్యాంక్ డిప్యూటీ రిజిస్ట్రార్
రూ.35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్టేట్ టాక్స్ ఆఫీసర్