Huge Number of RTC Buses to CM Jagan Siddham Meeting : వైఎస్సార్సీపీ సిద్ధం సభ వల్ల ప్రయాణికులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో ఎక్కడ సిద్ధం సభ జరిగినా బస్సులన్నీ వైఎస్సార్సీపీ సేవలో తరిస్తున్నాయి. ఆదివారం జరిగిన సభకు అల్లూరి జిల్లా మినహా శ్రీకాకుళం మొదలుకొని శ్రీ సత్యసాయి జిల్లా వరకు మొత్తం 25 జిల్లాల నుంచి సుమారు 3 వేల 500 బస్సులు మేదరమెట్ల వైపు పరుగుతీశాయి. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని దాదాపు అన్ని డిపోల నుంచి 80 శాతానికి పైగా బస్సులు తరలించారు. దీంతో ఈ జిల్లాల సామాన్య బస్సు ప్రయాణికుల (Passengers)కు చుక్కలు కనిపించాయి. శుక్రవారం శివరాత్రి, రెండో శనివారం, ఆదివారం ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నందున సొంతూళ్లకు వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు తిరుగు ప్రయాణానికి అవస్థలు పడ్డారు.
జనాలను హడలెత్తించిన సీఎం సభ- ఇంట్లో ఉన్నవారు సేఫ్! బస్సుల బంద్‌కు తోడు పోలీసు ఆంక్షలు
బాపట్ల డిపోలో 43 బస్సులున్నాయి. ఇందులో ఆరు హైదరాబాద్ తిరిగే దూర ప్రాంత సర్వీసులు కాగా, మిగిలిన 37లో 29 బస్సులను సీఎం (CM Jagan) సభకు తరలించారు. కేవలం 8 బస్సులనే ప్రయాణికుల కోసం నడిపారు. అంటే నిత్యం తిరిగే బస్సుల్లో నాలుగింట ఒక వంతునే సామాన్యుల కోసం కేటాయించారు. చిలకలూరిపేట డిపోలో 80 బస్సులున్నాయి. ఇందులో 50 వరకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను మేదరమెట్లకు పంపించేశారు. దూరప్రాంత సర్వీసులే మిగిలాయి. అవికూడా అరకొరగా తిరగడంతో ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. చిలకలూరిపేట నుంచి ఒంగోలుకు కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిలో 75 కి.మీ.దూరం ఉండగా బస్సులను పర్చూరు, చీరాల, చిన్నగంజాం మీదుగా మళ్లించారు. దీంతో 105 కి.మీ.దూరం ప్రయాణించాల్సి వచ్చింది.
సీఎం సభకు బస్సులు తరలింపు- నానా అవస్థలు పడుతున్న విద్యార్థులు, మహిళలు
Passengers Facing Problems : వేల మంది పాల్గొనే పల్నాడు జిల్లా అమరావతిలో అమరేశ్వరస్వామి రథోత్సవానికి కేవలం ఆరు అద్దె బస్సులనే నడిపారు. ఇక్కడికి గుంటూరు నుంచి నిత్యం అద్దె బస్సులతో కలిపి 16 వాహనాలు నడుస్తాయి. రథోత్సవం నాడు అదనంగా మరో 10 బస్సులు నడుపుతారు. ఈసారి సిద్ధం సభకు (Siddham Meeting) బస్సులన్నీ తరలించడంతో ఏర్పాట్ల ఊసేలేదు. గుంటూరు శివారులో జరుగుతున్న గుడారాల పండుగకు వివిధ జిల్లాలనుంచి వచ్చినవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారంతో పండుగ ముగియడంతో సొంత జిల్లాలు, గ్రామాలకు తిరిగి వెళ్లేందుకు బస్టాండుకు వచ్చి గంటల తరబడి నిరీక్షించారు. కడప జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 150 బస్సులను కేటాయించడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. గంగమ్మ జాతర సోమ, మంగళవారం ఉండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కానీ భక్తులకు రాయచోటికి వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో గంటలపాటు బస్టాండ్లలో పడిగాపులు కాయాల్సి వచ్చింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ బస్టాండ్‌లో ప్రయాణికులు బస్సులు కోసం గంటలు తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. జగ్గయ్యపేట ఆర్టీసీ డిపోను నుంచి రోజూ43 బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో 25 బస్సులను సిద్ధం సభకు కేటాయించడంతో నందిగామలో బస్సులు కోసం ప్రయాణీకులు గంటల తరబడి ఆర్టీసీ బస్టాండ్ లో వేచి ఉండాల్సి వచ్చింది. ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి 70 బస్సులు సిద్ధం సభకు తరలించారు. దీంతో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికులు బస్టాండ్‌లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. రాత్రి 11 గంటల వరకు బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు నిస్సహాయంగా బస్టాండ్‌లోని కుర్చీల్లో కూర్చున్నారు. డిపో సిబ్బందిని బస్సులు ఎప్పుడు వస్తాయో అని అడిగితే ఎప్పుడొస్తాయో అప్పుడే ఎక్కాలండి అని సమాధానం చెబుతున్నారని ప్రయాణికులు మండిపడ్డారు.
సిద్ధం సభకు 2 వేల 500 బస్సులు! - ఇంటర్ విద్యార్థుల పరిస్థితి ఏంటి - ప్రజలు ఎలా పోయినా పర్లేదా?
ప్రైవేటు బస్సులు, విద్యా సంస్థల బస్సుల్ని కూడా సిద్ధం సభకు తరలించారు. నిబంధనల ప్రకారం విద్యా సంస్థల బస్సుల్ని వాటికి అనుమతిచ్చిన మార్గాల్లో మాత్రమే నడపాలి. విద్యార్థుల్ని వారి ఇళ్ల నుంచి స్కూల్‌కి తీసుకొచ్చేందుకు, మళ్లీ ఇళ్ల వద్ద దింపేందుకు మాత్రమే వినియోగించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించి సీఎం జగన్ పాల్గొంటున్న సభలకు భారీ సంఖ్యలో స్కూల్ బస్సుల్లో జనాన్ని తరలిస్తున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ఆర్టీసీ, స్కూల్ బస్సులతో పాటు, తితిదేకి చెందిన వాహనాలు, శ్రీసిటీలోని పరిశ్రమలకు చెందిన వాహనాల్లోనూ జనాల్ని తరలించడంపై పలు విమర్శలు.