Huge loss for Munneru Flood Victims : మున్నేరు నది వరద ఖమ్మం నగరానికి తీవ్ర నష్టం చేకూర్చింది. మున్నేరు పరివాహక కాలనీల్లో ప్రజలు తీవ్రంగా నష్టం పోయారు. ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో ప్రజలు పరుగులు పెట్టారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 36 అడుగులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
24 గంటల పాటు పునరావాస కేంద్రాల వద్ద ఉన్న ప్రజలు వరద తగ్గడంతో నివాసాలకు చేరుకున్నారు. తీరా తమ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడి భీతావాహ పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఇంట్లో ఉన్న సమస్తం నానిపాడైపోయాయి. విలువైన టీవీ, కూలర్, ఫ్రీజ్, ల్యాప్‌టాప్ తదితర విలువైన వస్తువులు ఎందుకు పనికిరాకుండా పోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో అద్దెకు ఉంటున్నా. గ్రూప్ 2కు సన్నద్ధమవుతూ ఇంట్లోనే ఉంటున్నా. అర్ధరాత్రిలో వచ్చిన భారీ వరదకు పుస్తకాలన్నీ తడిసి ముద్దయ్యాయి. ఒక్కసారిగా వరద రావడంతో కేవలం నా సర్టిఫికెట్లు తీసుకుని ఓ బిల్డింగ్‌లోని నాల్గో అంతస్తులోకి వెళ్లా. అక్కడే ఉదయం వరకు ఉన్నాం. పుస్తకాల విలువ సుమారు రూ.5 నుంచి 6 వేలు ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో పుస్తకాలు కూడా కొనుకునేలా లేను. ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేయాలని కోరుకుంటున్నా'-బాధితులు
ఆక్రమణల కారణంగానే మున్నేరు వరద : ఇంట్లో నిత్యావసరాలు సైతం బురదమయం అయ్యాయని, వీధుల్లో బురద, ఇంట్లో బురద దీన్ని ఎలా పోగోట్టుకోవాలో తెలియని పరిస్థితి వచ్చిందంటూ బాధితులు వాపోయారు. మున్నేరు వరదకు కారణమైన ఆక్రమణలు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరద తగ్గి బురదమయంగా మారిన కాలనీలలో త్వరితగతిన ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టాలని బాధితులు వేడుకుంటున్నారు.
'ఒంటి గంటకు శబ్దం వస్తుందని చూస్తే అప్పుడే వరద నీరు ఇంట్లో వచ్చాయి. మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. చాలా ఇబ్బంది పడ్డాం. మేం పెంచుకుంటున్న కుక్కపిల్ల కూడా చనిపోయింది. ఇలా వరద రావడం ఇది రెండోసారి. ఇంట్లో ఉన్న విలువైన టీవీ, ఫ్రీజ్ అన్నీ వస్తువులు నీట మునిగాయి. ఇక్కడ కొందరు కాలువను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ కాలువ వెంటనే వెడల్పు చేయాలి. కాలువ వెడల్పు చేయకపోవడం వల్లే వరద వచ్చింది'-బాధితులు