ETV Karthika Deepotsavam Celebrations in Khammam : ఓం నమః శివాయ.. హరహర మహదేవ..శంభోశంకర నినాదాలతో ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం మారుమోగింది. ఈటీవీ ఛానెళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక దీపోత్సవం ఆద్యంతం కన్నులపండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్చరణలు, ప్రవచనకర్తల ఆధ్యాత్మిక ప్రసంగాలతో కార్యక్రమం భక్తి పారవశ్యంతో సాగింది. దీపోత్సవానికి భారీసంఖ్యలో హాజరైన మహిళలు పరమశివుని స్తోత్రించి దీపాలు వెలిగించి ఆనంద భరితులయ్యారు.
కార్తిక దీపోత్సవ వేళ ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది. ఈటీవీ ఛానెళ్ల ఆధ్వర్యంలో జరిగిన దీపోత్సవం నగరవాసుల్లో ఆధ్యాత్మికతనుతట్టిలేపింది. వందలాది మంది భక్తుల శివనామస్మరణలతోకళాశాల ప్రాంగణం మారుమోగింది. బుధవారం సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల కోలహలం నడుమ శివకేశవులతో సహా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలంతా సామూహిక దీపాలు వెలిగించడంతో మైదాన పరిసరాలు ధగధగలాడాయి.
'పవిత్రమైన కార్తిక దీపోత్సవాన్ని ఈటీవీ యాజమాన్యం ప్రతి జిల్లాల్లో చేపట్టడం చాలా సంతోషదాయకమైంది. కార్తిక మాసం నెల రోజులపాటు పూజలు చేస్తూ వారు కోరుకున్న కోరికలను శివుడు తప్పకుండా నెరవేర్చాలని కోరుకుంటున్నా'- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి
హరహర మహదేవ నినాదాలతో మార్మోగిన ప్రాంగణం : రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కలెక్టర్ ముజమ్ముల్ ఖాన్, మేయర్ నీరజ తదితరులు హాజరై వేదాశీర్వాచనాలు పొందారు. ఈటీవీ నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములవ్వడం సంతోషంగా ఉందని, దీపోత్సవంతో ఖమ్మంలో మరింత ఆధ్యాత్మికత సంతరించుకుందని చెప్పారు.
భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక సంస్కృతిని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని వారు వివరించారు. కార్తిక దీపోత్సవంలో ప్రవచన కర్త చెప్పిన ఉపన్యాసం మంత్రముగ్ధులను చేసిందని భక్తులు ఆనందం వ్యక్తంచేశారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిఏటా నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించిన వారికి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జ్ఞాపికలను అందజేశారు.
కన్నుల పండువగా సాగిన 'ఈటీవీ కార్తిక దీపోత్సవం' - శివనామస్మరణతో మార్మోగిన సరూర్‌నగర్ స్టేడియం
Karthika Deepothsavam: ఆదిలాబాద్‌లో ఆధ్యాత్మికం.. కన్నుల పండువగా కార్తిక దీపోత్సవం