Huge Applications For Liquor Shops In NTR District : ఏపీలో గత ప్రభుత్వ హయాంలోని పరిస్థితులు ఇప్పుడు మారాయి. నాణ్యమైన మద్యం దొరక్క మందుబాబులు సరిహద్దున ఉన్న తెలంగాణలోకి వెళ్లి తాగేవారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన సరుకును ఊరూవాడా వెలసిన దుకాణాల్లో విక్రయించేవారు. ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇవ్వడం అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచడంతో పాటు తక్కువ ధరకు నాణ్యమైన సరుకు విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం ఎన్టీఆర్ జిల్లాలో తెలంగాణ సరిహద్దున ఉన్న మద్యం దుకాణాల దరఖాస్తులపై పడింది. వీటిని చేజిక్కించుకునేందుకు పెద్దఎత్తున దరఖాస్తు చేస్తున్నారు.
వత్సవాయి మండలంలో అధిక దరఖాస్తులు : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో వత్సవాయి మండలంపై పలువురి దృష్టి పడింది. ఈ మండలంలో రెండు షాపులను ఎక్సైజ్ శాఖ నోటిఫై చేసింది. వీటికి రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. ఐదేళ్లలో మందుబాబులకు నచ్చిన బ్రాండ్లు దొరకలేదు. కేవలం జె బ్రాండ్లు మాత్రమే విక్రయించేవారు. దీంతో తెలంగాణ భూభాగంలోకి వెళ్లి తాగేవారు. ఊరూపేరూ లేని బ్రాండ్లను తెలంగాణ కంటే అధిక ధరలకు విక్రయించే వారు. ఈదఫా తెలంగాణ వారే ఎక్కువ మంది ఏపీకి వచ్చి తీసుకెళ్తారని దరఖాస్తుదారులు అంచనాకు వచ్చారు. ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న కొత్త ప్రైవేటు మద్యం దుకాణాల్లో ఐదేళ్ల కిందట మాదిరి అన్ని బ్రాండ్ల మద్యంతో పాటు తక్కువ ధరకు దొరకబోతోందన్న అంచనాల కారణంగా ఎక్కువ పడ్డాయి. క్వార్టర్ సీసా రూ.99 కే తీసుకువస్తామని ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. దీంతో ఎక్కువ మంది షాపులను దక్కించుకునేందుకు ఎగబడుతున్నారు.
వత్సవాయి మండలానికి అటువైపున ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం ఆనుకుని ఉంటుంది. పెనుగంచిప్రోలులోని లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే భక్తులు వత్సవాయి మండలం నుంచి వస్తుంటారు. ఈ నేపథ్యంలో గిరాకీ బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణకు చెందిన పలువురు సొంతంగా, మరికొందరు ఏపీలోని వారితో కలసి సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తు చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికే వత్సవాయి మండలంలో నోటిఫై చేసిన రెండు దకాణాలకు రికార్డు స్థాయిలో ఒక దానికి 108, మరో షాపునకు 100 దరఖాస్తులు రావడం చర్చనీయాంశమైంది. పెనుగంచిప్రోలు మండలంలోని నాలుగు దుకాణాలకు 91, 67, 67, 64, 64 చొప్పున భారీగా వచ్చాయి.
మద్యం టెండర్లతో ఏపీ ప్రభుత్వానికి భారీ ఆదాయం- 50 వేలు దాటిన దరఖాస్తులు