Arthritis Causes Symptoms : క్లిష్టమైన ఆర్థరైటిస్ వ్యాధి ప్రజలపై పంజా విసురుతోంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దల్లో ఈ సమస్య కనిపిస్తోందని వైద్య నిపుణులు అంటున్నారు. లక్షణాలను ముందే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చనని సూచిస్తున్నారు. దేశంలో ఆర్థరైటిస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఈ నెల 12న ప్రపంచ అర్థరైటీస్ నివారణ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధి తీవ్రత గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆర్థరైటిస్ వ్యాధి రకాలు : ఆర్థరైటిస్ వ్యాధిని పలు రకాలుగా విభజించారు. వృద్ధుల్లో ఎక్కువగా ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మహిళలు, యువతుల్లో లూపస్‌గా ఆర్థరైటిస్ వేధిస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల ముఖంపై సీతాకోక చిలుక ఆకారంలోని ఎర్రటి మచ్చలు ఏర్పడతాయని వివరించారు. మరికొంతమంది గౌట్‌తో బాధపడుతున్నారు. దీనివల్ల చేతులు, కాళ్ల వేళ్లు బాగాల్లో వాపు, నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.
ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి కారణంగా ఎముకలు పెలుసుబారి తీవ్రమైన కీళ్ల నొప్పులు వేధిస్తాయి. ఇదో ఆటో ఇమ్యూన్ అనారోగ్య సమస్య. మనలోని వ్యాధి నిరోధక శక్తి తిరిగి శరీరంపై దాడి చేసినప్పుడు ఈ ఆరోగ్య సమస్యకు కారణమవుతుంది. పిల్లల్లో సైతం జువైనల్ ఆర్థరైటిస్‌కు దారి తీస్తుంది. డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఇబ్బందులు లేకుండా బయట పడవచ్చు. ఆర్థరైటిస్ నుంచి బయట పడాలంటే వీలైనంత త్వరగా వ్యాధిని నిర్ధారణ చేసుకోవడం మంచిది.
ఈ లక్షణాలు ఉంటే
- 6 వారాల కంటే ఎక్కువ కాలం పాటు నిరంతర కీళ్ల నొప్పులు, వాపు
- దీర్ఘకాలికంగా జ్వరం ఉండటం
- ఎండ తగిలితే చర్మంపై దద్దుర్లు రావడం
- కీళ్ల నొప్పులు, నోటి పూత సమస్య పదేపదే వేధించడం
- బాగా బరువు తగ్గిపోవడం, ఆకలి లేమి
- కళ్లు తడి ఆరిపోవడం, నోరు, చర్మం పొడిగా మారడం
- ఉదయం పూట 45 నిమిషాలు కంటే ఎక్కువ సమయం తీవ్రమైన వెన్ను లేదా మెడనొప్పి
- కీళ్ల నొప్పులు, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం
- కండరాల బలహీనత, నొప్పులు
- చిన్న పిల్లల్లో అయితే కీళ్ల నొప్పులు వేధించడం
"అర్థరైటీస్ సమస్యకు ప్రస్తుతం ఆధునిక చికిత్సా విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. సంప్రదాయ గోలీలు నుంచి అధునాతన బయోలాజికల్ ఇంజక్షన్లు, కార్‌టిసెల్ థెరపీ కూడా అందుబాటులో ఉంది. అర్థరైటీస్ చికిత్సల్లో స్టెరాయిడ్ల వాడకంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యుల పర్యవేక్షణలో కొద్ది మోతాదులో స్వల్ప కాలానికి స్టెరాయిడ్లను ఉపయోగించవచ్చు. లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా రుమటాలజిస్టులను వెంటనే సంప్రదించాలి. పరీక్షల ద్వారా ఏ రకమైన అర్థరైటీస్ ఉందనేది నిర్ధారణ అవుతుంది"- డాక్టర్ వి.శరత్‌చంద్రమౌళి, కిమ్స్ రుమటాలజీ విభాగాధిపతి
విటమిన్ D లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం - ఇవి తినండి కావాల్సినంత అందుతుంది! - Best Foods for Vitamin D