Documents For International Driving License Application : విదేశీ రోడ్లపై కారు మీద చక్కర్లు కొట్టాలని చాలా మందికి ఉంటుంది. అలాగే కార్లపై రయ్ రయ్ మంటూ పర్యాటక ప్రదేశాలను చుట్టి రావాలని అనుకుంటారు. ముఖ్యంగా యూట్యూబర్స్, చదువు, ఉద్యోగం, పర్యాటకం పేరుతో విదేశాలకు వెళ్లి అక్కడి ప్రదేశాలను చూడాలని అనుకుంటారు. కానీ వారికి కచ్చితంగా ఐడీపీ ఉండాల్సిందే. ఇంతకీ ఐడీపీ అంటే ఏంటి?. అది ఉంటేనే విదేశాల్లో వాహనం నడపడానికి ఆస్కారం ఉందా? అంటే అందరూ అవుననే సమాధానం చెబుతారు. ఎందుకంటే అక్కడ ఐడీపీ అంత ముఖ్యం.
ఇంతకీ ఐడీపీ అంటే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్. ఈ లైసెన్సు ఉంటే విదేశాల్లో డ్రైవింగ్ చేయడానికి అర్హత ఉన్నట్లు. లేకపోతే అక్కడి రోడ్లపై వాహనం నడపడానికి వీల్లేదు. ఈ ఐడీపీ లేకపోతే విదేశాల్లో పర్యాటక ప్రదేశాలు చూడడానికి వెళ్లినప్పుడు జేబులు ఖాళీ అవ్వక తప్పదు. అందుకే ఐడీపీకి దరఖాస్తు చేసుకొండి. అసలు ఈ లైసెన్సును పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలో తెలుసా?
దరఖాస్తు విధానం :
- ముందుగా ఆర్టీఏ వెబ్సైట్ లేదంటే సమీపంలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి.
- అక్కడ దరఖాస్తు కోసం ఫారం-4ఎ ను నింపాలి. ఈ ఫారం-4ఎతో పాటు ఈ కింది వాటిని అటాచ్ చేయాలి.
- డ్రైవింగ్ లైసెన్సు జిరాక్స్
- ఆరోగ్య ధ్రువీకరణ పత్రం
- పాస్‌పోర్టు జిరాక్స్
- 4 పాస్‌పోర్టు సైజు ఫొటోలు
- నిర్ణీత రుసుం చెల్లించాలి.
- వీటిని పరిశీలించిన తర్వాత ఇంటికే స్పీడ్ పోస్టులో ఐడీపీ కార్డు పంపిస్తారు.
ఐడీపీ కార్డు పొందడానికి అర్హతలు :
- ఈ ఐడీపీ కార్డు పొందడానికి 18 ఏళ్లు పైబడి వయసు ఉండాలి. దరఖాస్తు చేసిన తేదీ నుంచి కనీసం 6 నెలలపాటు చెల్లుబాటు అయ్యేలా పాస్‌పోర్టు తప్పనిసరి. ఇంటి చిరునామా తెలిపే ఆధార్, కరెంట్ బిల్ జత చేయాలి.
- ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 10,838 మంది ఈ ఐడీపీ లైసెన్సులు తీసుకొని విదేశాలకు వెళ్లారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సునే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్‌గా వ్యవహరిస్తారు.
- చదువుతోపాటు పార్ట్‌టైం ఉద్యోగాలు చేసేందుకు కొన్ని దేశాల్లో నిబంధనలు చెల్లవు. దీంతో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సుతో తెలిసిన వారి వద్ద ఉద్యోగాలు చేసుకోవచ్చు.
- మనదేశంలో తీసుకున్న లైసెన్సుతో దాదాపు 150 దేశాల్లో వాహనాలు నడపవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు కావాలంటే భారత్‌లో డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి.
- ఐడీపీ ఉంటే స్థానికంగా తెలియని రోడ్లను సైతం సులువుగా నావిగేట్ చేసుకోవచ్చు.
- విదేశాల్లో అనేక కంపెనీలు వాహనాలు అద్దెకు ఇస్తుంటాయి. మన దగ్గర అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు ఉంటే జేబులుకు చిల్లు పడదు. ఎందుకంటే అక్కడ డ్రైవర్లు దొరకడం కష్టం. లేకపోతే అక్కడి డ్రైవర్‌ను పెట్టుకుంటే భారీ చెల్లింపులు చేయాలి.
- చాలా మంది విదేశాలకు పర్యాటకం పేరుతో వెళుతుంటారు. అక్కడి దేశాలు చుట్టి యూట్యూబ్ ఛానల్లో వింతలు, విశేషాలు రికార్డు చేసి వారి ఛానళ్లలో పెడుతుంటారు. ఇలాంటి వారికి వారికి ఐడీపీ అనేది గ్లోబల్ మొబిలిటీని కల్పిస్తుందని అనడంతో సందేహం లేదు.