Housewife got Two Govt Jobs : అన్ని రకాల అవకాశాలు, సౌకర్యాలు ఉన్న కొందరు అనుకున్నది సాధించలేక పోతుంటారు. తమ పరాజయానికి కుంటి సాకులు చెబుతుంటారు. అటువంటి వారందరికి చెంపపెట్టుగా నిలిచింది ఈ గృహిణి. కృషి, పట్టుదలతో మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చునని రుజువు చేసింది. ఓ వైపు భర్తతో కలిసి హోటల్ నిర్వహిస్తూనే, వీలు చిక్కినప్పుడల్లా ఖాళీ సమయాల్లో యూట్యూబ్‌లో క్లాస్‌లను వింటూ పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యింది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో, ఏకంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.
Success story of Mahabubabad Jyothi : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన జ్యోతికి, కేసముధ్రం మండలంలోని కల్వల గ్రామానికి చెందిన నవీన్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు మల్టీమీడియాలో శిక్షణ పొందుతుండగా, రెండో కుమారుడు ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ దంపతులు జీవనోపాధి కోసం కేసముద్రం మండల కేంద్రానికి వచ్చి 2018 నుంచి హోటల్‌ను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
హోటల్ నిర్వహణలో భర్తకు సహాయంగా నిలుస్తూనే ఆమె ఎంఏ, బీఈడీ పూర్తి చేశారు. గత సంవత్సరం ఆగస్టులో నిర్వహించిన గురుకుల పాఠశాలల పీజీటీ(PGT), టీజీటీ ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్ల(JL) ఉద్యోగాలకు పరీక్ష రాశారు. వారం రోజుల కిందట వెలువడిన పీజీటీ ఫలితాల్లో జ్యోతి ఎంపికయ్యారు. గురువారం వెలువరించిన జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్ని సైతం సాధించారు. మరోవైపు టీజీటీ ఫలితాల్లో 1:2 జాబితాలో పేరు వచ్చింది. ఏకకాలంలో ఒక్కటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
4 ప్రభుత్వ ఉద్యోగాలను ఒడిసిపట్టిన వరంగల్ కుర్రాడు
జూనియర్ లెక్చరర్ ఉద్యోగంలో చేరనున్నట్లు తెలిపారు. 2017లో నిర్వహించిన డీఎస్సీలో(TS DSC) కొద్ది మార్కుల తేడాతోనే ఉద్యోగం చేజారిందని, మళ్లీ అటువంటి పరిస్థితి తలెత్తకుండా బాగా చదివినట్లు పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ క్లాస్‌లను ఎంతో మేలు చేశాయని తెలిపారు. మనం తలచుకుంటే సాధించలేనిదంటూ ఉండదని, ధైర్యంతో ముందడుగేస్తే విజయం ఖాయమని చెప్పుకొచ్చారు. ఈ విజయంలో తన భర్త నవీన్ కృషి మరువలేనిదని పేర్కొన్నారు. చదువు కోసం అన్ని వేళల తనను ప్రోత్సహించాడాన్ని జ్యోతి పేర్కొన్నారు.
"నిన్న విడుదలయిన జూనియర్ లెక్చరర్ ఉద్యోగ జాబితాలో నా పేరుంది. అలాగే గురుకుల పీజీటీ ఉద్యోగానికి ఎంపికయ్యాను. టీజీటీ 1:2 జాబితాకి సెలెక్టయ్యాను. ఈ విజయంలో మా భర్త సహకారం చాలా ఉంది. మనస్ఫూర్తిగా పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధించగలం. ఏకకాలంలో రెండు ఉద్యోగాలకు ఎంపికయినందుకు ఆనందంగా ఉంది". - జ్యోతి, గృహిణి