Hyderabad Rains 2024 : రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంట పలు ప్రాంతాలను హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పరిశీలించారు. గత సంవత్సరం వర్షాలతో నీరు నిలిచిపోయిన కొల్లూరు జంక్షన్, మల్లంపేట, షామీర్‌పేట తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఓఆర్‌ఆర్ వెంట డ్రెయిన్ల పరిస్థితిని కమిషనర్ సర్ఫరాజ్ క్షుణ్నంగా పరిశీలించారు. పూడికతీత పనులపై ఆరా తీశారు.
ఓఆర్‌ఆర్‌పై సమీక్ష : ఓఆర్ఆర్ నిర్వహణ సంస్థ మెసర్స్ ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థకు కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పలు కీలక సూచనలు చేశారు. ఓఆర్‌ఆర్‌పై ప్రస్తుతం చేస్తున్న పనులన్నీ అలాగే కొనసాగించాలని ఆయన తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఎప్పటికప్పుడు చేపట్టాల్సిన పనుల ప్రాధాన్యం గురించి వివరించారు. ఒకవేళ నీళ్లు చేరినా, తోడేసేందుకు పంపులు, ఎక్స్‌కవేటర్లు, ఇతర యంత్రాలను సిద్ధంగా ఉంచుకుని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ఇంత భారీ వర్షాలు కురిసినా ఎక్కడా నీరు నిల‌్వలేకపోవడంపై అధికారులను ప్రశంసించారు.
పూడికతీతపై ఆరా : ఓఆర్ఆర్ మీద వెళ్లే వాహనదారులకు సాయం చేసేందుకు పెట్రోలింగ్ బృందాలను మరింతగా పెంచాలని కమిషనర్ సర్ఫరాజ్ అధికారులను ఆదేశించారు. అలాగే వేరియబుల్ మెసేజెస్ సైన్ (వీఎంఎస్) బోర్డుల మీద రెయిన్ అలర్ట్ మెసేజీలు చూపిస్తూ వాహనదారులను అప్రమత్తం చేయాలని కమిషనర్ సూచించారు. పూడికతీత పనులను సరైన సమయానికి, సమర్థంగా చేసినందుకు ఐఆర్‌బీ సంస్థను ఆయన అభినందించారు.
దీనివల్ల వర్షపు నీరు ఎప్పటికప్పుడు వెళ్లిపోతూ, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉందని తెలిపారు. భారీ వర్షాల సమయంలో కూడా హైదరాబాద్ వాసుల ప్రధాన రవాణా మార్గమైన ఓఆర్ఆర్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలు వెళ్తుండటం వెనక నిర్వహణ బృందాల కృషి ఎంతో ఉందని శ్లాఘించారు. ఆయనతో పాటు హెచ్‌జీసీఎల్ సీజీఎం రవీంద్ర, ఐఆర్‌బీ ఇంజినీర్లు, ఇతర అధికారులు కలిసి పర్యటించారు.