EAPCET 2024 Examination : ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే విద్యార్థుల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌కి(EAPCET 2024) ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మే 7వ తేదీ నుంచి 11 వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఈఏపీసెట్ని నిర్వహించనున్నారు. సెట్ నిర్వహణ బాధ్యతలు ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూకి అప్పగించింది.
యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు విద్యార్థులు - UPSC final Results 2023
ఈ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్లో నిర్వహించిన సమావేశంలో, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నరసింహారెడ్డి, ఈఏపీసెట్ కన్వీనర్ కుమార్, కో-కన్వీనర్ విజయ్ కుమార్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌కి మొత్తం 3లక్షల 54వేల 803 దరఖాస్తులు రాగా, అందులో ఒక్క ఇంజినీరింగ్ కోసమే 2లక్షల 54వేల 543 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అందులో 2లక్షల 5వేల 472 మంది తెలంగాణకు చెందినవారు కాగా, మరో 49వేల 71 మంది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారని జేఎన్టీయూహెచ్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 21 జోన్లలో పరీక్ష నిర్వహించనుండగా, 16 తెలంగాణలో, 5 ఏపీలో ఉండనున్నాయి. హైదరాబాద్‌ని నాలుగు జోన్లుగా చేసిన జేఎన్టీయూహెచ్, 64 కేంద్రాల్లో ఫార్మా, అగ్రికల్చర్ పరీక్షను, 81 కేంద్రాల్లో ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ నిర్వహించనుంది.
ఏపీలో కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరుల్లో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ఇంజినీరింగ్‌కి దరఖాస్తు చేసుకున్న వారిలో లక్షా 3వేల 862 మంది విద్యార్థినులు, లక్షా 50వేల 600 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక ఈఏపీసెట్ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి విభజన చట్టం ప్రకారం పదేళ్లు పూర్తి కానందున్న ఏపీ విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం సైతం సీట్ల కేటాయింపు యథాతథంగా కొనసాగించనున్నట్టు అధికారులు స్పష్టంచేశారు.
పరీక్షా కేంద్రాలలోనికి ఎలక్ట్రానికి గ్యాడ్జెట్లు, నీళ్ల సీసాలు అనుమతించబోమన్న వారు, విద్యార్థినులు చేతికి మెహందీ, టాటూ వంటి డిజైన్లు ఉంచుకోరాదని స్పష్టం చేశారు. మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఇందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈఏపీసెట్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పేపర్ కూర్పు నుంచి కేంద్రాల ఎంపిక వరకు పూర్తిస్థాయిలో ఎక్కడికక్కడ పటిష్ఠ చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ సాంకేతిక అంశంలో విద్యార్థులు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వారితో వ్యక్తిగత లేఖ రాయించుకుని పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించనున్నట్టు స్పష్టంచేసింది.
"ఈఏపీసెట్ పరీక్షను మే7 నుంచి 11వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో పరీక్షను నిర్వహిస్తున్నాము. ఈసారీ ఫేసియల్ రికగ్నిషన్‌ను అమలు చేస్తున్నాము.". - ఆచార్య లింబాద్రి, ఉన్నత విద్యామండలి ఛైర్మెన్
UPSC భారీ నోటిఫికేషన్ - 1930 పోస్టుల భర్తీ - అప్లై చేసుకోండిలా!