Disha Encounter Case : దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట లభించింది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్కర్ కమిషన్ ఆధారంగా సదరు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే.
క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన కమిషన్, ఎన్‌కౌంటర్ అంతా బూటకమని పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తమ నివేదికలో పేర్కొంది. ఈ కమిషన్ నివేదికపై స్పందించిన పోలీసులు, నివేదిక సరిగ్గా లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసుల పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది.
సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు నిందితుడు ఆత్మహత్య- లాకప్‌లోనే సూసైడ్ - Salman Khan shooting case
సంచలనం సృష్టించిన ఘటన.. 2019, నవంబర్ 27న జరిగిన దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు షాద్‌నగర్ ఓఆర్‌ఆర్ టోల్‌గేట్‌కు సమీపంలో దిశాను అత్యాచారం చేసి, హత్య చేశారు. మృతదేహాన్ని షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి జాతీయ రహదారిపై ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి డీజిల్ పోసి నిప్పంటించారు.
ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, 2019 డిసెంబర్ 6న తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా తమ వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు యత్నించగా, నిందితులపై కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో పలు మానవ హక్కుల సంఘాలు, ఎన్జీవోలు కోర్టును ఆశ్రయించాయి.
ఈఎన్‌కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసి ఆర్నెళ్ల గడువు విధించింది. దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో క్షేత్రస్తాయిలో సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ వీఎస్ సిర్కూర్కర్, జస్టిస్ పీఎస్బీ రేఖ, డాక్టర్ డీఆర్ కార్తికేయన్‌తో కూడిన కమిషన్, సుప్రీంకోర్టుకు సమర్పించిన 387 పేజీల నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించింది. దిశా నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని తమ నివేదికలో స్పష్టం చేసింది. 10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టి విచారణ జరపాలని సిఫార్సు చేసింది. మృతుల్లో ముగ్గురూ మైనర్లేనని కమిషన్ వెల్లడించింది.
నిందితులు పిస్టోళ్లు లాక్కొని కాల్పులు జరుపుతూ పారిపోయారనే పోలీసుల వాదన ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని, కమిషన్ తెలిపింది. నిందితులకు పిస్టోల్ పేల్చే విధానం తెలియదని పేర్కొంది. పారిపోతుంటే 41 రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారని, అయితే వాటికి సంబంధించి ఆధారాలు సమర్పించకపోవడం అనుమానాస్పదంగా ఉందని వెల్లడించింది.