HC Rejects Mohan Babu Bail Petition : సీనీ నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. విలేకరిపై హత్యాయత్నం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పహాడీషరీఫ్ పీఎస్‌లో నమోదైన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మోహన్‌బాబు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ మరోసారి విచారణ చేపట్టారు. మోహన్‌బాబు తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు.
మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై : మోహన్‌బాబు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారని, ఆయన విశ్వవిద్యాలయానికి సంబంధించిన పనులతో పాటు సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు చూసుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దుబాయ్‌లో ఉన్న తన మనవడిని చూసేందుకు వెళ్లి తిరిగి వచ్చి తిరుపతిలోనే ఉంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన గుండె, నరాల సంబంధిత సమస్యలతో పాటు మతిమరుపు వ్యాధితోనూ బాధపడుతున్నాడని బెయిల్ మంజూరు చేయాలని మోహన్‌బాబు తరఫు న్యాయవాది కోరారు.
'ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు' : గాయపడ్డ విలేకరి రంజిత్ ఘటన కంటే ముందు మోహన్‌బాబుకు తెలియదని, తెలియని వ్యక్తిని ఎందుకు హత్య చేయాలనుకుంటారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోలీసులు ముందు సాధారణ సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఆ తర్వాత హత్యాయత్నం కేసు నమోదు చేశారని ఇది తగదని ఆయన కోర్టుకు తెలిపారు. రంజిత్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే మోహన్‌బాబుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. మోహన్‌బాబును విచారించాల్సి ఉందని, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ఏపీపీ వాదించారు.
ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు : విలేకరి రంజిత్ తరఫు న్యాయవాది సైతం ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. మోహన్‌బాబు మైకు తీసుకొని దాడి చేయడం వల్ల రంజిత్ చెవి భాగంలో తీవ్ర గాయాలయ్యాయని ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించారన్నారు. ప్రస్తుతం ఆహారం తీసుకోవడంలోనూ రంజిత్ ఇబ్బంది పడుతున్నారని ఇంకా గాయం మానలేదని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను కొట్టేశారు. ట్రయల్ కోర్టులో విచారణకు హాజరైన సమయంలో బెయిల్ ఇవ్వాలని కింది కోర్టును ఆదేశించాలని మోహన్‌బాబు తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో పహాడీషరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మోహన్ బాబుపై చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ - తీర్పును వాయిదా వేసిన కోర్టు
'నా ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించలేదు' - మోహన్‌బాబు మరో ట్వీట్