High Court on YS Sunitha Petition: వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పులివెందుల మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు నమోదు చేసిన కేసులో వీరికి ఊరట దొరికింది. తదుపరి చర్యలను నాలుగు వారాల పాటు నిలుపుదల చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వాయిదా వేసింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వైఎస్ సునీత, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారనే ఆరోపణతో వివేకా పీఏ కృష్ణారెడ్డి 2021 డిసెంబరులో పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ఒత్తిడి చేస్తున్నారని, అదే విధంగా సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని ఆరోపించారు.
దీంతో 2023 డిసెంబరు 8వ తేదీన కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపింది. కేసు నమోదు చేసి జనవరి 4న తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పులివెందుల పోలీసులు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు. అభియోగపత్రం దాఖలు చేశారు. పులివెందుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతోపాటు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సునీత, రాజశేఖర్‌రెడ్డి, ఎస్పీ రామ్‌సింగ్ పిటిషన్లు దాఖలు చేశారు.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దును కోరే హక్కు దస్తగిరికి ఉంది: హైకోర్టు - Viveka Murder Case
గతంలో విచారణ సాగింది ఇలా: దీనిపై గతంలోనూ విచారణ జరిగింది. వివేకా హత్యకేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు వాంగ్మూలం ఇవ్వాలని బలవంతం చేసినట్లు వివేకా పీఏ కృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ తరఫున న్యాయవాది ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. వివేకా వద్ద పీఏగా పని చేసిన నేపథ్యంలో హత్య గురించి కృష్ణారెడ్డికి తెలిసి ఉంటుంది కాబట్టి వాంగ్మూలం ఇవ్వాలని మాత్రమే ఎస్పీ కోరారని తెలిపారు.
అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగిపై కేసు నమోదు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి అని రామ్‌సింగ్ తరఫు న్యాయవాది అన్నారు. రామ్‌సింగ్ విషయంలో అనుమతి తీసుకోలేదన్నారు. పిటిషనర్ల కారణంగా కృష్ణారెడ్డి కుమారుడి పెళ్లి కూడా నిలిచిపోయిందని తప్పు చేయకపోయినా ఆయన 90 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండాల్సి వచ్చిందని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.
విచారణ ఈనెల 29కి వాయిదా: తాజాగా జరిగిన విచారణలో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఎస్పీ రామ్ సింగ్‌కు ఊరట లభించింది. వీరిపై తదుపరి చర్యలు నాలుగు వారాల పాటు నిలుపుదల చేసిన హైకోర్టు, విచారణను ఈనెల 29కి వాయిదా వాయిదా వేసింది.
సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే రూ.20కోట్లు ఇస్తామన్నారు: దస్తగిరి