Heavy Rains in Mahabubnagar : మహబూబ్‌నగర్ పట్టణంలో జగ్జీవన్‌రాంనగర్ కాలనీ, కుర్హిని శెట్టి కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. జడ్చర్ల పట్టణంలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదనీరు చుట్టుముట్టి జడ్చర్ల ప్రభుత్వాసుపత్రి, ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలోకి నీరు చేరి రోగులు ఇబ్బంది పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో పంటచేలు నీట మునిగాయి. వడ్యాల్ గ్రామ శివారులో కేఎల్‌ఐ కాల్వలో ఉద్ధృతి కారణంగా కట్ట తెగి పంటపొలాల్లోకి నీరు చేరుతోంది. ఎత్తం, మైలారం గ్రామాల్లో వరిపంట నీట మునిగింది.
ఇల్లు కూలి మృతి : నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామంలో ఇల్లు కూలి తల్లి, కుమార్తె మృత్యువాత పడ్డారు. సరళసాగర్ గేట్లు తెరచుకోవడంతో మదనాపురం- ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చంద్రవాగు ఉద్ధృతికి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి చౌటపల్లి మీదుగా బాణాల, బిల్లకల్లు, వెంకటగిరి గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి- మాధవస్వామి నగర్, మంచాలకట్ట మధ్యనున్న వంతెనపై వరదనీరు పారడంతో రాకపోకలు ఆగిపోయాయి.
నిలిచిన రాకపోకలు : మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ సమీపంలో కల్వర్టు తెగిపోవడంతో తాండూరు- మహబూబ్‌నగర్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గట్టు రావిపాకుల దగ్గర వాగుపొంగి గట్టు రావిపాకుల- గడ్డంపల్లి వైపు దారి లేకుండా పోయింది. తెలకపల్లి మండలం రామగిరి వద్ద వాగు ఉద్ధృతికి తెలకపల్లి- కల్వకుర్తి పట్టణాలకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు.
వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం బీసీరెడ్డిపల్లి- రాయినిపల్లి గ్రామాల మధ్య వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. బావాయిపల్లి, కోడేరు- పసుపుల, ఖానాపూర్ నాగులపల్లి తండా మాచుపల్లి గ్రామాల పరిధిలోని వాగులు ఉదృతంగా ప్రవహించడంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లాలోని ఊకచెట్టు, పెద్దవాగు, దుందుభీ వాగు, నల్లవాగు, చంద్రవాగు సహా ప్రధాన వాగులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మదనాపురంలో సరళాసాగర్ నిండి సైఫన్ సిస్టం ద్వారా పనిచేసే స్వయం చాలిత గేట్లు తెరచుకున్నాయి. కానాయపల్లి గ్రామంలోకి నీరు చేరుతుండటంతో శంకర సముద్రం జలాశయం నుంచి 3 గేట్లు ఎత్తి 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు ఐదు జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కంట్రోల్ రూమ్ (08545- 2241165), వనపర్తి జిల్లా కంట్రోల్ రూం (08545-233525), (08545-220351), నాగర్ కర్నూల్ జిల్లా కంట్రోల్ రూం (08540-230201) అత్యవసర సమయాల్లో సంప్రదించాలని సూచించారు.