Rains In Telangana : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. షేక్‌పేట, ఫిలింనగర్, గచ్చిబౌలి మార్గంలో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. మెహిదీపట్నం, టోలిచౌకి మార్గంలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
అటు కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాచుపల్లి, మూసాపేట్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, బహదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, బోయిన్‌పల్లి, ప్రగతి నగర్, బేగంపేట, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాచుపల్లి, మూసాపేట్‌లోనూ వర్షం పడింది.
నిజామాబాద్‌లో వర్షాలు : మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నిజామాబాద్‌లోని రైల్వే బ్రిడ్జి వద్ద వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. పోలీసులు, స్థానికులు ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు. మరోవైపు బోధన్, ఆర్మూర్, బీర్కూర్, నవీపేట, ఇందల్వాయి, డిచ్పల్లి, సిరికొండ మండలాల్లో జోరు వాన కురిసింది.
ఉక్కపోత నుంచి ఉపశమనం : తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా వర్షాలు లేక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఇవాళ కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఏకధాటిగా వర్షం కురువడం వల్ల ప్రధాన రహదారులపై నీరు చేరి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపోవడంతో రహదారులపై వరద నీరు ప్రవహించింది.
సంగారెడ్డిలో భారీ వర్షం : తెలంగాణలోని సంగారెడ్డి నియోజకవర్గంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సదాశివపేట పట్టణంలో వర్షానికి డ్రైనేజీ నీరు నిండి రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. మున్సిపాలిటీలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని, వర్షాలు కురిసినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తోన్న వర్షాలు- కొట్టుకుపోతున్న పంటలు - Rainfall in AP Today
ద్రోణి ఎఫెక్ట్ - పలు ప్రాంతాల్లో దండయాత్ర చేస్తున్న వర్షాలు - Low Pressure Rains in AP