Heavy Rainfall in Hyderabad City : హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకాపుల్‌లో తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. కోఠి, దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది. రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.
సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యారడైజ్, కుత్బుల్లాపూర్, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, బాలానగర్, దుండిగల్, సూరారం, బహదూర్‌పల్లి, జగద్గిరిగుట్ట, మల్లంపేటలో వర్షం బేగంపేట్, చిలకలగూడ, మారేడుపల్లి ప్రాంతాలలోనూ భారీగా వర్షం పడింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రహదారుల అన్నీ జలమయం కాగా పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షంతో పాటు చల్లగాలులు వీస్తుండడంతో వాతావరణం ఒక్కసారి చల్లగా మారిపోయింది.
తెలుగురాష్ట్రాలకు తప్పిన వాయుగుండం ముప్పు! : ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పింది. అయినప్పటికీ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం రెండు మూడ్రోజుల్లో వాయుగుండంగా మారి తీవ్రతరం కానుందని ప్రకటించింది. అయితే, ఆ వాయుగుండం వాయువ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తీరాలకు చేరుకోనుందని తెలిపింది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పినట్లయింది. కానీ, ఈ ప్రభావంతో ఈ నెల 8 వరకు వర్షాలు కురిసే అవకాశం మాత్రం ఉన్నట్లు అంచనా వేసింది.
వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు : ఈ నెలలో నమోదైన వర్షపాతం చూస్తే గత పదేళ్లలో ఎన్నడూలేని అత్యంత వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారిణి శ్రావణి తెలిపారు. వాతావరణ పరిస్థితుల్లో చాలు మార్పులు కనిపిస్తున్నాయన్నారు. ఒకేసారి అధిక వర్షపాతం నమోదవ్వడం, సుదీర్ఘ విరామం వంటి పరిస్థితులు శీతోష్ణస్థితి వల్ల ఏర్పడుతున్నట్లు వివరించారు. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో వరదలకు ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయని ప్రముఖ పర్యావరణవేత్త దొంతి నరసింహా రెడ్డి వ్యాఖ్యానించారు. అందులో ఒకటి కాలుష్య ఉద్గారాలు అయితే, మరొకటి ప్రకృతి విధ్వంసం, చెరువులు, కుంటలు, వాగులు అక్రమణకుగురై మేటవేయడం, వైశాల్యం తగ్గిపోవడం వల్ల పడిన వర్షం చాలా వేగంగా ప్రవహించి వరదలు సంభవిస్తున్నట్లు చెప్పారు.
ఏపీలో వరద సృష్టించిన బీభత్సం - కర్షకుల కష్టం 'కృష్ణా'ర్పణం - AP FLOODS EFFECT 2024