Heavy Rain Water Floating in Budameru at Nandivada : కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం వస్తోంది. గత 30 సంవత్సరాలలో బుడమేరు ఎన్నడూ ఇంతటి ఉద్ధృతంగా ప్రవహించలేదని ముంపు ప్రాంతాల ప్రజలు అంటున్నారు. పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వరద నీరు చేరింది. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరిపిరాలలో అత్యంత ప్రమాద స్థితిలో బుడమేరు ప్రవహిస్తోంది. కట్టకు అడుగు దూరంలో నీరు ప్రవహిస్తుంది. అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
బోట్ల ద్వారా పంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఒడ్డుకు చేరుస్తున్నారు. 3 వేల మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. పలు చోట్ల చేపలు చెరువులకు గండ్లు పడ్డాయి. పుట్టగుంట వద్ద బుడమేరు వరద ఉద్ధృతిని కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాలతో బోట్ల ద్వారా ముంపు బాధిత ప్రజలకు టీడీపీ నేతలు ఆహారాన్ని అందిస్తున్నారు. బుడమేరు నీటి ఉద్ధృతిపై అధికారులతో కలెక్టర్ బాలాజీ సమీక్షించారు. బస్సులు, పడవల్లో ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్ బాలాజీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ బాలాజీ కోరారు.
రైతుల ఆశలపై నీళ్లు చల్లిన బుడమేరు వరద - నీట మునిగిన వేలాది ఎకరాలు - Heavy crop loss due to Budameru
Ministers Lokesh And Nimmala Visit Budameru: బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతానికి వెళ్లే మార్గం లేకపోవడంతో బురదలో మంత్రులు కాలినడకన అక్కడికి చేరుకున్నారు. అధికారులు మొదటి గండిని పూడ్చారు. మొత్తం ఎన్ని గండ్లు పడ్డాయి, వాటి తీవ్రత, ఎప్పటిలోగా గండ్లు పూడ్చగలమని అధికారులను లోకేశ్, రామానాయుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ఐదు సంవత్సరాలలో కనీస మరమ్మతుల పనులు కూడా చేయకపోవడమే గండ్లు పడటానికి ప్రధాన కారణమని అధికారులు మంత్రులకు వివరించారు. 200 మీటర్ల వెడల్పున మూడు గండ్లు ఏర్పడ్డాయని అధికారులు లోకేశ్‌కు వివరించారు. వేగవంతంగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎంత ఖర్చయినా పర్లేదని నిధుల కోసం వెనుకాడ వద్దని సూచించారు.
సమాంతరంగా గండ్లు పడిన ప్రతిచోట వేగవంతంగా పనులు పూర్తి చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. అవసరమైన యంత్రాలు, సామాగ్రిని యుద్ధ ప్రాతిపదికన తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. డ్రోన్ ద్వారా జరుగుతున్న పనులను ప్రతి గంటకు పర్యవేక్షిస్తానని లోకేష్ అధికారులకు చెప్పారు. ప్రతి గంటకి ఎంత పని జరిగిందో తనకు నివేదించాలని అధికారులను కోరారు.
బుడమేరుకు మళ్లీ క్రమంగా వరద పెరుగుతోంది. మంగళవారం సుమారు వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. నేడు ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో మరో అడుగు పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరింది.
ఇప్పటికే మొదటి గండిని పూడ్చారు. మిగతా 2 గండ్లు పూడ్చేలా పనులు జరుగుతున్నాయి. పెరుగుతున్న వరద ప్రవాహంతో పనులకు ఆటకం కలుగుతోంది. మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ ప్రవాహం పెరుగుతుందని స్థానికులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మిగిలిన గండ్లు పూడ్చే ప్రక్రియను పర్యవేక్షించాలని నిమ్మల రామానాయుడిని లోకేశ్ కోరారు. క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షించాలన్నారు.
సవాలుగా బుడమేరు గండి మరమ్మతు- పనులను పరిశీలించిన మంత్రి లోకేశ్ - Ministers Lokesh Visit Budameru