Heavy Rain Warnings For Several Districts in AP : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులోని కారైకాల్ వద్ద తీరం దాటుతుందని అమరావతి ఐఎండీ ప్రకటించింది. ఈ వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల స్పీడ్‌తో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారి కర్ణసాగర్ తెలిపారు. ఇది శ్రీలంకలోని ట్రింకోమలీకి ఉత్తర ఈశాన్యదిశగా 270, నాగపట్టణానికి తూర్పుగా 300, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 340, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు.
వాయువ్య దిశగా కదిలి, బలపడి రానున్న 6 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత ఇది వాయువ్య దిశగా కదిలి రేపు (నవంబర్ 30) మధ్యాహ్నం సమయంలో నార్త్ తమిళనాడు-పుదుచ్చేరి దగ్గర, కారైకాల్ - మహాబలిపురం తీరాల మధ్య, పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను తీరం దాటే టైంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయన్నారు. తుపానుకు ‘పెంగల్’గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, మిగిలిన అన్ని పోర్టుల్లో 1వ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు తెలిపారు.
తుపాను స్థితిని తెలుసుకోవడానికి ఇస్రో శాటిలైట్స్ : మరోపక్క బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిరంతరం ఏపీ సర్కార్‌కు నిరంతరం సంకేతాలను అందిస్తోంది. ఇండియాకు చెందిన ఇన్సాట్-3డీఆర్, ఈవోఎస్ -06 శాటిలైట్ల ద్వారా ఎప్పటికప్పుడు పెంగల్ తుపాను స్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్రో అందిస్తోంది. దీంతో విపత్తుల కట్టడికి ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ఉపగ్రహాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇస్రో, ఏపీ గవర్నమెంట్‌ను అలర్ట్ చేయగా వారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
మరికొన్ని గంటల్లో తీరం దాటనున్న తుపాన్ - ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
రెయిన్ అలర్ట్ : బంగాళాఖాతంలో వాయుగుండం - 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం!