Heavy Rain In Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఖమ్మం జిల్లాలో వరదల్లో 110 గ్రామాలు చిక్కుకున్నాయి. కాకరవాయిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 3 దశాబ్దాల తర్వాత రెండేళ్ల కిందట 30 అడుగులకు చేరిన మున్నేరు, ఈసారి ఊహించని రీతిలో 36 అడుగులకు పైగా చేరి అత్యంత ప్రమాదకరస్థాయిలో ప్రవహించింది.
మహోగ్ర రూపం దాల్చిన మున్నేరు : ముంపు ప్రాంతాలు, బాధిత కాలనీల ప్రజలకే కాదు, అధికార యంత్రాంగానికి కనీసం ఊహకందని రీతిలో గంటల వ్యవధిలోనే వరద విలయం పోటెత్తడంతో ముంపు ప్రాంతాలు గజగజా వణికిపోయాయి. ఆదివారం ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న మున్నేరుకు వరద పోటు క్రమంగా పెరుగుతూ వచ్చింది. అత్యంత వేగంగా వరద ప్రవాహం పోటెత్తడంతో మహోగ్ర రూపం దాల్చింది. ముంపు ప్రాంతాలైన రామన్నపేట, దానవాయి గూడెం కాలనీ, గణేశ్ నగర్, మేకల నారాయణ నగర్, ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతం సారథినగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కల గడ్డ, మోతీ నగర్, పంపింగ్ వెల్‌రోడ్ బురద రాఘవాపురం, ధంసలాపురం కాలనీలు ముంపునకు గురయ్యాయి.
జలదిగ్భంధంలో చిక్కుకున్న కాలనీలు : వందల సంఖ్యలో ఇళ్లను వరద చుట్టు ముట్టింది. భారీ వర్షంతో పాటు కాల్వలు, నాలాల ఆక్రమణలతో నగరంలోని పలు కాలనీలను వరద ముంచెత్తింది. శ్రీనగర్‌కాలనీ, చెరువు బజార్, చైతన్య నగర్, కవిరాజ్ నగర్, ప్రశాంతినగర్, టేకులపల్లి, రోటరీనగర్, ఖానాపురం కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ప్రకాశ్‌నగర్ వంతెనపై చిక్కుకున్న 9 మంది ఖమ్మం వాసులకు దాదాపు 15 గంటల తర్వాత విముక్తి కలిగింది. మున్నేరు వంతెనపై చిక్కుకున్న 9 మందిని మంత్రి తుమ్మల చొరవతో ఎట్టకేలకు రాత్రి 10 తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
మధిర నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బాధితులను పరామర్శించి భరోసా కల్పించారు. పాలేరు, ఖమ్మం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. బాధితులకు అండగా ఉంటామని ఎవరూ అధైర్యపడొద్దని మంత్రులు భరోసా ఇచ్చారు.
పాలేరు నియోజకవర్గం ఉక్కిరిబిక్కిరి : మున్నేరు వరద ఉద్ధృతితో పాటు భారీ వర్షాలతో పాలేరు నియోజకవర్గం ఉక్కిరిబిక్కిరైంది. పాలేరు జలాశయానికి గతంలో ఎన్నడూలేనంతగా లక్షా 60 క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరింది. వరద ఉద్ధృతి పెరగటంతో 8 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుకున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో నాగార్జున సాగర్ ప్రధాన ఎడమ కాలువ తెగింది.
పాలేరుకు దిగువన మల్లాయిగూడెం యూటీ వద్ద రెండో జోన్ ఎడమ కాలువకు భారీ గండి పడింది. భారీ వర్షాలు, వరదల ధాటికి కూసుమంచి మండలంలో ఇద్దరు కొట్టుకుపోయారు. నాయకన్‌గూడెం సమీపంలో సిమెంట్ బ్రిక్స్ తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులు పాలేరు వరదప్రవాహానికి గల్లంతయ్యారు. వారి కుమారుడు ప్రవాహంలో కొట్టుకుపోతుండగా పోలీసులు రక్షించారు. వరద ఉద్దృతికి భక్తరామదాసు పంప్‌హౌజ్ నీట మునిగింది.
ముల్కలపల్లి మండలం కొత్తూరు శివారులో సీతారామ ప్రధాన కాలువకు 30 మీటర్ల మేర గండిపడింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టులో తాత్కాలికంగా నిర్మించిన రింగ్ బండ్ భారీ వర్షాలకు గండిపడింది. ఆ ప్రాజెక్టు కింద ఉన్న రాష్ట్ర రైతులు సాగు చేసిన పంటలకు సాగు నీరు అందించే లక్ష్యంతో 3.5 కోట్లతో సర్కార్ రింగ్‌బండ్ నిర్మాణం చేపట్టింది. పనులు దాదాపు పూర్తి కావస్తున్న సమయంలో కురిసిన భారీ వర్షం కారణంగా ప్రాజెక్టులోకి వరద పోటెత్తడంతో నిర్మాణానికి భారీ గండి పడి పలుచోట్ల కుంగిపోయి బీటలు వారింది.