Munneru in Spate in Khammam : చరిత్రలో ఎప్పుడూ ఎరుగని రీతిలో మున్నేరు మహోగ్రరూపం దాల్చింది. మొదటిసారి అత్యంత గరిష్ఠ నీటిమట్టం 36 అడుగులు దాటి ప్రవహించింది. శనివారం రాత్రి వరకు శాంతంగానే ఉన్న మున్నేరు, ఆ తర్వాత రోజు ఉదయం ఆదివారం తన ప్రతాపాన్ని చూపిస్తూ సాయంత్రానికి ఉగ్రరూపాన్నే దాల్చింది. దీంతో మున్నేరు వాగు ముంపు, పరీవాహక ప్రాంతాల ప్రజలు కకావికలం అయ్యారు. ఎటు చూసినా వరద నీటితో ఒక చెరువును తలపించింది. కాదు నదినే పొంగి వెలుతుందా అన్నట్లు ప్రవాహం సాగింది.
నీటిలో చిక్కుకున్న దానవాయిగూడెం కాలనీ, మేకల నారాయణనగర్, గణేశ్‌నగర్, సారథినగర్, ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతం, పద్మావతినగర్, బొక్కలగడ్డ, పంపింగ్ వెల్ రోడ్, మోతీనగర్, మేకల వెంకటేశ్వరనగర్, ధంసలాపురం కాలనీల్లో సోమవారం ఎటుచూసినా వరదనే కనిపించింది. ఈ దృశ్యాలను చూస్తే హృదయం ద్రవించుకుపోవాల్సిందే.
ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలు నష్టం : మున్నేరు ముంచడంతో ప్రాణాలు దక్కించుకోవడానికి కట్టుబట్టలతో వెళ్లిన బాధితులు, తిరిగి ఇళ్లకు వచ్చేసరికి శాంతం తన ఒడిలోకి ఊడ్చేసుకుంది. ముంపునకు గురైన ఇళ్లల్లో నిత్యావసరాలు, బీరువాలు, ఫ్రిజ్‌లు, టీవీలు, కూలర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు తదితర సామగ్రి వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. పదుల సంఖ్యలో వాహనాలు దెబ్బతినగా, విద్యార్థుల పుస్తకాలు, ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తడిసి ముద్దయ్యాయి. ఈ ప్రళయానికి ఒక్కో కుటుంబానికి సుమారు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.
ఆకృతిని కోల్పోయిన ఇళ్లు : ఆదివారం కాస్త వరద ఉద్ధృతి తగ్గడంతో ముంపు కాలనీల్లో బురద ఎక్కడికక్కడ మేటలు వేసి కనిపిస్తున్నాయి. కాలనీల్లోని రహదారులు ధ్వంసమయ్యాయి. ప్రధాన రహదారులు, అనుసంధాన రోడ్లు విధ్వంసానికి గురయ్యాయి. కొన్నిచోట్ల ఇంటి గోడలు కూడా కూలిపోయాయి. మున్నేరు వాగుకు సుమారు కిలోమీటరు మేర ఉన్న ఆవాసాలు ఆనవాళ్లను కోల్పోయాయి. వరద నీటితో కొట్టుకొచ్చిన చెత్తాచెదారంతో చిందరవందరగా ఉన్నాయి. కాలనీల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దీంతో బాధితులు దాహార్తితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో పునరావాస కేంద్రాల్లో బాధితులకు ప్రభుత్వం భోజన సదుపాయం కల్పించింది. ముఖ్యంగా ఇళ్లల్లో ఉన్నవారికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహార పొట్లాలు అందించింది. మరికొందరికి ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువులు ఆహారం తీసుకువచ్చారు. ముంపు కాలనీలు చాలా వరకు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. బురదమయం అయిన ఇళ్లను ఇంట్లో వారంతా కలిసి శుభ్రం చేసుకుంటున్నారు.