Health Tips For Flood Effected People : వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. ఇక గత రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలు, వచ్చిన వరదలతో ఈ వ్యాధులు మరింత ప్రబలే అవకాశం ఉంది. అయితే వీటి బారిన పడకుండా జాగ్రత్త పడటం మీ చేతిలోనే ఉంది. జ్వరం వచ్చా బాధ పడే బదులు రాకుండా చూసుకోవడం ఉత్తమం. ఓవైపు వరదలు, మరోవైపు మురుగు ఇంకోవైపు దోమలు. చుట్టూ ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలోనూ దోమలు కుట్టకుండా రోగాల బారిన పడకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మరి ఆ జాగ్రత్తలు ఏంటంటే?
Dengue Cases in Telangana : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు డెంగీ, మలేరియా, టైఫాయిడ్. అయితే ఇవి వ్యాప్తి చెందకుండా దోమల నివారణ చేపట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాలల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు. దోమల వల్లే డెంగీ కేసులు పెరుగుతున్నందున వీటి బారిన పడకుండా ఏం చేయాలో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం రండి.
దోమల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
- ఇంట్లో ఉండే కూలర్లు, కుండీలతో పాటు మిగతా వస్తువుల్లో నీటి నిలువలు లాంటివి ఉంటే వాటిని తొలగించాలి.
- నీటి గుంతలు, మురుగు నీరు ఉంటే, వాటి మీద ఒక చుక్క కిరోసిన్ లేదా నూనె లాంటివి వేయాలి. దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు.
- దోమ కాటు నివారించడానికి బట్టలు నిండుగా వేసుకోవాలి.
- ఇంటి తలుపులు సాయంత్రం కాగానే మూసి వేయాలి.
- దోమ తెరలు వాడాలి. దోమ నాశకాలు లాంటివి ఉపయోగించాలి.
- దోమలను నివారించడానికి డీడీటీ లాంటివి పిచకారి చేయించాలి. నివాస సముదాయాల వద్ద దోమల వ్యాప్తిని తగ్గించుకోవాలి.
- బయట ఆహారం తీసుకోకుండాఇంట్లోనే అన్ని రకాల పండ్లు తినాలి.
- కూరగాయలతో భోజనం చేస్తే మంచిది.
- జ్వరం వచ్చినప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
- కాచి వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలి.
- చల్లని వాతావరణం వల్ల ఇంట్లో బ్యాక్టీరియా మరింత వ్యాపించే అవకాశం ఉంది కావును ఎప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.
ఇక సీజనల్ వ్యాధుల్లో ఇటీవల పెద్ద సంఖ్యలో విజృంభిస్తోంది అతిసార. ఇటీవల కురిసిన వర్షాల వల్ల తాగునీటితో మురుగు కలవడం వల్ల ఆ నీటినే ప్రజలు తాగడం వల్ల చాలా మంది అతిసార బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు మంచి నీటినే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ముందుగా నీటిని బాగా వేడి చేసిన తర్వాత కాస్త చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. మరోవైపు వేడివేడిగా ఉండే తాజా తాజా ఆహారాన్ని మాత్రమే ఈ సీజన్‌లో తీసుకోవాలి.
జ్వరంతో పాటు జలుబు, గొంతు నొప్పి, పొడి దగ్గు లాంటి లక్షణాలు వర్షాకాలంలో సర్వసాధారణం. ఇవే 80 నుంచి 85% వరకు వైరల్ వ్యాధులకు కారణమవుతాయి. వీటికి ఆధారం ఇన్ప్‌ఫెక్షన్‌లని వైద్యులు అంటున్నారు. జ్వరం అనేది ఒక లక్షణం. దాన్ని తడి గుడ్డ పెట్టడం, నీళ్లు బాగా తాగడం, పారాసిట్‌మాల్ వేసుకోవడంతో నియంత్రించుకోవచ్చు.