Health and Money Saving Tips : మనిషికి కూడు, గుడ్డ, నీడ ఈ మూడు ఉంటే సరిపోతుందనే వారు మన పెద్దలు. కానీ నేటి సమాజంలో కూడు,గుడ్డ, నీడతో పాటు ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఆర్థిక భద్రత కోసం చిన్న వయసు నుంచే చాలా మంది మంచి ప్రణాళికతో డబ్బును కూడబెట్టుకుంటున్నారు. విభిన్న మార్గాల్లో పొదుపు, మదుపు చేస్తూ భవిష్యత్తు అవసరాలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తపడుతున్నారు.
చిన్నప్పటి నుంచే మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేస్తేనే ఆర్థిక భద్రతలా ఆరోగ్య భద్రత సాధించవచ్చు. డబ్బు పొదుపు, మదుపు త్వరగా ప్రారంభిస్తే 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి పెద్ద మొత్తం సమకూరుతుందని ఆర్థిక నిపుణులు చెబుతారు. ఉద్యోగం రాగానే, ఉపాధి దొరకగానే చిన్న మొత్తంలోనైనా మదుపు చేయడం ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఆరోగ్యం విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. రోజూ మంచి ఆహారం, వ్యాయామం, ఆటలు అలవాటు చేసుకుంటే శరీరం దృఢంగా తయారవుతుంది. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు రాకుండా తోడ్పడుతుంది.
భిన్న రంగాల్లో పెట్టుబడులు : పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకే రంగంలో పెట్టుబడులు పెట్టొద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. నష్ట భయం తగ్గించుకోవడానికి షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బంగారం తదితరాల్లో మదుపు చేయాలని తెలుపుతున్నారు. వ్యాయామం విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఏదో ఒక వ్యాయామం మాత్రమే చేస్తే ఫలితాలు అందుకోలేమని శరీరతత్వానికి భిన్నమైన వ్యాయామాలను ఎంచుకోవాలని తెలిపారు. జిల్లాలో కొందరు నడకకు పరిమితమైతే మరికొందరు జిమ్‌లలో కసరత్తుకు ప్రాధాన్యమిస్తారు.
ఇంకొందరు ఆటలు చాలనుకుంటారు. కానీ అన్ని రకాల వ్యాయామాలు చేసినప్పుడే శరీరానికి మేలు జరుగుతుందని వ్యాయామ నిపుణులు చెబుతారు. వారంలో మూడు రోజులు గుండెకు వ్యాయామం కోసం నడక, పరుగు, సైక్లింగ్‌తో పాటు కండరాల బలిష్ఠం కోసం మూడు రోజులు బరువులు లేపే కసరత్తులు అవసరమని పేర్కొంటారు. యోగా, ప్రాణాయామం కూడా జత చేస్తే మంచి ఆరోగ్యం సొంతమవుతుందంటారు.
రోజులో గంట పక్కన పెట్టాలి : భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా సంపాదనలో పొదుపు, మదుపునకు కేటాయించిన తరవాతే మిగతా మొత్తం ఖర్చు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తారు. వ్యాయామం విషయంలోనూ ఇదే పద్ధతి అవలంబించాలి. రోజుకు 23 గంటలే అన్నట్లుగా ప్రణాళిక వేసుకుని ఆ గంట మాత్రం ఆరోగ్యం కోసం వ్యాయామానికి వెళ్లాలి. రోజూ వ్యాయామం కోసం సమయం కేటాయిస్తేనే ఊబకాయం సమస్యలు, జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనం గడపొచ్చు.
ఆపకుండా కొనసాగాల్సిందే : కొంతమంది మదుపు ప్రారంభించినా ఫలితాలు రాలేదని కొద్ది రోజులకే ఆపేస్తారు. వేరే మదుపు పద్ధతిపై దృష్టి పెడతారు. ఇది సరికాదని పెట్టుబడులకు లాభాలు రావాలంటే వేచి చూడటం అవసరమని, పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతారు. వ్యాయామ ఫలితాల విషయంలోనూ ఇలా చేయకూడదు. చాలా మంది బరువు తగ్గాలనో, కండలు పెరగాలనో ఆవేశంగా వ్యాయామం చేసి వెంటనే ఫలితాలను ఆశిస్తున్నారు. సాధ్యం కాకపోయేసరికి మానేస్తున్నారు. రోజూ మంచి అలవాట్లతో వ్యాయామాన్ని కొనసాగిస్తేనే శరీరం దృఢంగా మారడంతో పాటు ఊబకాయం తగ్గుతుందని, ఆరోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు, వ్యాయామ నిపుణులు చెబుతున్నారు.
ఈ పథ్యాహారం - మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలట! - ఎలా తీసుకోవాలో తెలుసా?
Financial planning : కొత్తగా సంపాదించడం స్టార్ట్ చేశారా?.. ఈ 5 ఫైనాన్సియల్ మిస్టేక్స్ చేయకండి!