Harish Rao Reacted On Farmers Loan Waiver : అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై నేడు సాధారణ చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. బడ్జెట్ కేవలం అంకెల గారెడిలా ఉందని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందన్నారు. కేసీఆర్ కిట్ లాంటి పథకాలు పేర్లు మార్చి పంపిణీ చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
బడ్జెట్ కేటాయింపులపై హరీశ్‌రావు సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సాధ్యం కాని తరహాలో ఆదాయం ఎక్కువ చూపారని మండిపడ్డారు. తప్పనిసరి ఖర్చులను తక్కువ చేసి చూపారని పేర్కొన్నారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రూ.35 వేల కోట్లు వస్తుందని బడ్జెట్‌లో పెట్టారని అన్నారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ కోసం భూములు అమ్మితే భట్టి, శ్రీధర్‌బాబు విమర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు రూ.10 వేల కోట్ల భూములు అమ్మి నిధులు సమీకరిస్తామని చెబుతున్నారని మండిపడ్డారు.
మీ మాటపై గౌరవం ఉంటే భూములు అమ్ముకునే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని హరీశ్‌రావు సూచించారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు కానీ, బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రుణమాఫీ ఆలస్యం అయిందని బ్యాంకర్లు వడ్డీని రైతు నుంచి వసూలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల రైతులపై వడ్డీ భారం పడుతోందని వాపోయారు.
వాస్తవాలు తెలుసుకుని తప్పులు సరిచేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మా అప్పుల గురించి చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మేము సృష్టించిన ఆస్తుల గురించి చెప్పట్లేదు. రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశామని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రూ.4.5 లక్షల లేని జీఎస్‌డీపీని రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము అప్పులు చేసింది ఆస్తుల కల్పన కోసమే. దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన నిధులు తెచ్చుకున్నారు. కానీ బీఆర్ఎస్ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. - హరీశ్ రావు, మాజీ మంత్రి