Harish Rao Letter To CM On Sunflower Crop : రాష్ట్రంలో ప్రజల సమస్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖలు రాస్తున్నారు. కొన్నిరోజుల క్రితం టెట్ ఫీజులు భారీగా పెంచారని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆ తర్వాత పాడి రైతులకు పెండింగ్లో ఉన్న రూ. 80 కోట్ల బిల్లులను చెల్లించాలని లేఖలో సీఎంను కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో పక్షం రోజులకోమారు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
Sunflower Crop Procurement in Telangana : తాజాగా పొద్దు తిరుగుడు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దుతిరుగుడు పంట వేశారని, సరైన ధరలు లేక నష్టపోతున్నారని తెలిపారు. రూ. 6,760 రూపాయల కనీస మద్దతు ధరను ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చిన మేరకే రైతుల నుంచి పంటను కొనుగోలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాల్సిన వాటాను మరిచిపోయారని హరీశ్ రావు విమర్శించారు. రైతులు తమ 75 శాతం పంటను కేవలం నాలుగైదు వేల రూపాయలకే అమ్ముకుని నష్టపోతున్నారని వాపోయారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర చెల్లించి పంటను కొనుగోలు చేయాలని కోరారు.
"రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి కొనుగోలు చేయాలి. కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చిన మేరకే కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం తరుపున కొనుగోలు చేయాల్సిన వాటా గురించి మౌనంగా ఉండడం రైతులను వంచించడమే అవుతుంది. ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు కేవలం నాలుగైదు వేలకే తమ పంట అమ్ముకుని నష్టపోవాల్సి వస్తుంది. మీరే స్వయంగా జోక్యం చేసుకుని పొద్దుతిరుగుడు పువ్వు పంటను మొత్తం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసి, రైతులు ఆదుకోవాలని కోరుతున్నాను." - మాజీ మంత్రి హరీశ్ రావు