Harish Rao fires on Congress : కేసీఆర్ పోరాటం పిలుపుతో, రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి(KRMB) ప్రాజెక్టులు అప్పజెప్పబోమని అసెంబ్లీలో తీర్మానం చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇది ముమ్మటికీ బీఆర్‌ఎస్ పోరాట ఫలితమేనన్నారు. అసెంబ్లీ సమావేశాల నిరవధిక వాయిదా అనంతరం హరీశ్‌రావు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేక గారడీలు చేస్తున్నారని, హామీల విషయంలో సర్కార్ దాటవేత వైఖరిని ప్రజలకు తెలియజేశామని స్పష్టం చేశారు.
Harish Rao Reacts on White Paper : అసెంబ్లీలో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని, అయినప్పటికీ ధీటుగా బదులిచ్చినట్లు హరీశ్‌రావు(Harish Rao) తెలిపారు. శాసనసభలో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో తప్పులు ఉన్నాయని, ఎత్తి చూపితే ప్రభుత్వం నుంచి కనీస సమాధానం లేదన్నారు. మీడియాకు వాస్తవ ప్రజెంటేషన్ విడుదల చేస్తామన్నారు. తమకు వివరణలకు, నిరసనకు అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసుకొని పోయారని మండిపడ్డారు.
ముగిసిన తెలంగాణ శాసనసభ సమావేశాలు - నిరవధిక వాయిదా వేసిన స్పీకర్
కేంద్ర సంస్థ కాగ్‌ను పనికిరాదని తాము అనలేదని, అప్పటి కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్, వారి నేతలు అన్న మాటలే చెప్పామన్నారు. సాగునీటి రంగంపై ఇవాళ శ్వేతపత్రం విడుదల చేసింది. అది వైట్ పేపర్ కాదు, ఫాల్స్ పేపర్ అని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందాలని మేడిగడ్డను భూతద్దంలో పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి. తమపై బురదజల్లాలనుకున్నా ఇంకో రూపంలో చేయండి. కానీ, ప్రాజెక్టును మాత్రం ఈ వానాకాలం లోపల మరమ్మతులు చేసి సేఫ్ జోన్‌లోకి తీసుకురావాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆలస్యం చేస్తే రైతులకు బురద కూడా మిగలని పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయని హరీశ్‌రావు దుయ్యబట్టారు. శాసనసభలో ఇవాళ బీఆర్ఎస్‌ను ఇరికించబోయి కాంగ్రెస్ నేతలు బోల్తా పడ్డారని, కేఆర్‌ఎంబీ అంశంలాగే శ్వేతపత్రం విషయంలో సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు వారివద్ద సమాధానాలు లేవని, కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారన్నారు. వారెన్ని ఆరోపణలు చేసినా, తాము నీళ్లు ఇచ్చింది నిజం, పంట పండింది నిజం. రైతులకు ఆనందంగా ఉన్నది నిజం అని వెల్లడించారు.
"కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విజయాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేక గారడీలు చేస్తున్నారు. మా హయాంలో రైతులు ఆనందంగా ఉన్నారు. మీ హయాంలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎక్కడున్నా మాది ప్రజల పక్షమే. కంచు కంచే, కనకం కనకమే. సమాధానం లేక అడుగడుగునా అడ్డం పడుతున్నారు. సభలో అడ్డుకోవచ్చు కానీ, ప్రజా క్షేత్రంలో అడ్డుకోలేరు". - హరీశ్‌రావు, మాజీమంత్రి
అది శ్వేతపత్రం కాదు, ఫాల్స్ పేపర్ - గత ప్రభుత్వంపై బురద జల్లేందుకే : హరీశ్‌రావు