Harassment of Student by Fellow Students in Gurukula : తోటి విద్యార్థుల వికృత చేష్టలు భరించలేక ఓ విద్యార్థి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు కామారెడ్డి జిల్లాలోని ఒక సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో బాధిత విద్యార్థి ఆరో తరగతి చదువుతున్నాడు. అదే తరగతికి చెందిన 15 మంది విద్యార్థులు ఇష్టారీతిన ప్రవర్తించి, అతనిపై దాడి చేస్తున్నారని తన తండ్రికి ఫోన్ చేసి వాపోయాడు. 'నాన్న నేను ఇక్కడ ఉండలేను. నన్ను ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఇంటికి వచ్చేస్తా.' అని ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి తలుపు మూసి దుస్తులు లేకుండా డ్యాన్స్ చేయిస్తున్నారని, కొడుతున్నారని, దుప్పటి లాగేసి నిద్రలేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాలు ఎవరికైనా చెబితే 'రాత్రి నీ సంగతి చూస్తాం' అని బెదిరిస్తున్నారని తండ్రితో చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. దసరా సెలవులకు వెళ్లి వచ్చినప్పటి నుంచి మరింత ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు.
మందలించిన ప్రిన్సిపల్ : దీంతో ఆ తండ్రి ఆదివారం తన బంధువుల సాయంతో కుమారుడిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. తోటి విద్యార్థులు ఇలా ప్రవర్తించడంపై బాలుడి తండ్రి ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రిన్సిపల్ విద్యార్థులను మందలించినట్లు సమాచారం. ఈ విషయమై ప్రిన్సిపల్‌ను వివరణ కోరగా, విద్యార్థి తండ్రి తనకు ఫోన్ చేసి విషయం చెప్పారని, బాలుడిని స్కూల్‌కి పిలిచి వివరాలు తెలుసుకుని తోటి విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.
జూనియర్లకు సీనియర్ల ర్యాగింగ్ : గత జులైలోనూ ఇలాంటి ఓ ఘటన వెలుగు చూసింది. జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి దారుణంగా హింసించి పైశాచిక ఆనందం పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజ్ బాలుర వసతి గృహంలో సీనియర్లు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. ఈ క్రమంలోనే ఊత కర్రతో చితకబాది పైశాచిక ఆనందం పొందారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.