Hanauman Jayanti Celebrations in Kondagattu : జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రద్దీగా మారింది. దీక్ష విరమణ కోసం హనుమాన్ మాలధారులు భారీగా వస్తున్నారు. దీక్షాపరుల రాకతో కొండంతా రామనామస్మరణతో మారు మోగుతోంది. భక్తుల తాకిడి పెరుగుతుండటంతో పోలీసులు భద్రతా చర్యలు పెంచారు. జూన్ 1 వరకు కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.
దీక్షా విరమణ కోసం వచ్చే భక్తులకు 300 మంది అర్చకులను, తలనీలాల సమర్పణ కోసం 1500 మంది నాయి బ్రహ్మణులను అధికారులు నియమించారు. 4 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కొండపైకి చేరేందుకు ఆర్టీసీ నాలుగు ఉచిత బస్సులను నడపనుంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, చలవ పందిళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఐతే తాగునీరు ఇబ్బంది ఉందని పారిశుద్ధ్యం లోపించిందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అంజన్నకు పట్టు వస్త్రాలు : భద్రాచలం శ్రీ సీతారాముల తరపున ఈరోజు అంజన్నకు భద్రాద్రి ప్రధాన అర్చకులు పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ క్రతువుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల సందర్భంగా మూడు రోజుల పాటు యాగశాలలో లోక కల్యాణం కోసం హోమం నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులలో భద్రతా ఏర్పాటు చేయగా 115 సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
Kondagattu Temple : అంజన్న భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు.. గుట్టంతా కాషాయమయం
హనుమాన్ పెద్ద జయంతి వేడుకల ఏర్పాట్లు : స్వామి వారి ప్రసాదం విక్రయానికి 14 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు టిక్కెట్ల ఇష్యూ, అక్రమ వసూళ్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో కొండగట్టుకు వచ్చే దీక్షాపరులు ప్రమాదాల బారిన పడకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. భక్తులు మార్గమధ్యలో సేదతీరడానికి ప్రధాన రహదారి పక్కన పలుచోట్ల తడికల పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఉచిత అన్నదానం చేస్తున్నారు.
"హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకుని మూడు రోజులు విశేషమైన కార్యక్రమాలు జరగనున్నాయి. హనుమాన్ మాలధారులు దీక్ష విరమణ కోసం భారీగా వచ్చారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, చలవ పందిళ్లు, ప్రసాదం విక్రయానికి 14 కౌంటర్లు ఏర్పాటు చేశాం." -చంద్రశేఖర్, కొండగట్టు ఆలయ ఈవో