Hanamkonda Naimnagar Nala Bridge Construction : హనుమకొండ నయీనంగర్ నాలా విస్తరణ పనులు పూర్తికావడంతో వాహన రాకపోకలు మొదలయ్యాయి. హనుమకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే ప్రధానమార్గం ఇదే కావడంతో నిత్యం ఈ మార్గం రద్దీగా ఉంటుంది. అలాగే వాణిజ్య సముదాయాలు పాఠశాలలలు, హోటళ్లు కూడా ఈ మార్గంలో ఎక్కువే. దీంతో ఎప్పుడూ సందడిగా ఉండే ఈ రహదారి వంతెన నిర్మాణ పనులు కారణంగా ఇన్నాళ్లూ బోసిపోయినా మళ్లీ కళ సంతరించుకుంది. నయీంనగర్ నాలాపై వంతెన నిర్మాణానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో శంకుస్ధాపన జరిగింది. వర్షాల్లోనూ పనులు జోరుగా జరిగాయి. దీంతో ఐదునెలల్లోనే నాలా విస్తరించి వంతెన నిర్మాణం పూర్తిచేశారు.
తప్పిన వరద సమస్య : వాహన రాకపోకలు ప్రారంభం కావడంతో వాహనదారుల కష్టాలు తప్పాయి. అంతేకాదు నగరానికి వరద సమస్య కూడా తప్పింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురిసినా హనుమకొండ నగరం మాత్రం ఈ దఫా నీట మునగలేదు. నాలుగైదేళ్లుగా నిత్యం వరదలతో ఈ మార్గం మునిగిపోయేది. నాలా నిండిపోయి వరద నీరు చుట్టుముట్టడంతో సమీప కాలనీ వాసులునాలుగైదు రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపేవారు. అయితే నాలా విస్తరణతో వరద సమస్య తీరింది. ఇటీవల భారీ వర్షాలు కురిసినా ఈ నాలా పరిసర ప్రాంతాలు జలమయం కాలేదు.
దాదాపు 8 కోట్ల రూపాయల వ్యయంతో నాలాపై వంతెన నిర్మించడమే కాకుండా ఆక్రమణలను తొలగించి రెండు వైపులా 20 అడుగుల మేర నాలాను విస్తరించారు. దీంతో వరద నీరు సాఫీగా పోయేందుకు మార్గం సుగమమైంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. వంతెన నిర్మాణం పూర్తయినా సుందరీకరణ పనులు ఇంకా జరుగుతున్నాయి. అయినా నగరవాసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాకపోకలను వెంటనే అనుమతిస్తున్నారు. నాలా విస్తరించడంతో నగరవాసుల వరద కష్టాలు గట్టెక్కాయి.
"నయీంనగర్ నాలాపై హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో కష్టాలు తప్పాయి. గతంలో వంతెన చిన్నదిగా ఉండటంతో వరదలతో వాహనరాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. అధికారులు స్పందించి నాలుగు నెలల్లోనే వంతెన పూర్తి చేశారు. దీంతో భారీ వర్షాలు పడినా నాలా పరిసర ప్రాంతాలు జలమయం కాలేదు." -నగరవాసులు
Warangal Flood Victims Problems : అంతా బురదమయం.. బతుకంతా ఆగమాగం.. ఇదీ వరంగల్వాసుల దీనగాథ