Half Day Schools in Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 6 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అదేంటి? ఇది వేసవి కాలం కాదు కదా, పోనీ ఎండలేమైనా ఎక్కువగా ఉన్నాయా అంటే అదీ లేదు కదా!. మరి ఇప్పుడు ఒంటి పూట తరగతులేంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారా? మీ ఆశ్చర్యంలో అర్థం ఉన్నా, మేం చెప్పింది నిజమే. ఈ నెల 6 నుంచి తెలంగాణలో ఆఫ్ డే స్కూల్స్. కాకపోతే అన్ని తరగతుల వారికి కాదు, కొందరికి మాత్రమే. అసలు విషయం ఏంటంటే?
రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి కులగణన చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఉపాధ్యాయులను వినియోగించాలని సర్కార్ నిర్ణయించింది. 36,559 మంది ఎస్జీటీల సేవలను, 3,414 మంది ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్స్, 6,256 మంది ఎంఆర్సీలు, 2000 మంది ప్రభుత్వ మినీస్టీరల్ స్టాఫ్ సహా వివిధ విభాగాల్లో పని చేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్‌తో కలిపి పాఠశాల విద్యా శాఖ నుంచి మొత్తం 50 వేల మంది సిబ్బందిని కుల గణనకు వినియోగించనున్నారు. అయితే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్ టీచర్లకు మినహాయింపు ఇస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.
ఒంటిపూట తరగతులు : కులగణనకు ప్రైమరీ పాఠశాలల ఎస్జీటీలు, హెడ్ మాస్టర్ల సేవలను వినియోగించనున్న నేపథ్యంలో ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పని చేయనున్నట్టు పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. సర్వే పూర్తి అయ్యేవరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొననున్న ఉపాధ్యాయులకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ వేతనాలు చెల్లిస్తుందని స్పష్టం చేసింది.
75 ప్రశ్నలతో సర్వే : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. వీటి నుంచి సమాచారం సేకరిస్తారు. ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు ఉండగా, మరో 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం రెండు పార్టులు అంటే పార్టు-1, పార్టు-2గా ఉండి ఎనిమిది పేజీల్లో సమాచారం పూరించనున్నారు. పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉండాయి. అంటే సాధారణ, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, రాజకీయ సమాచారం అడగనున్నారు. అలాగే పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు. ఇందులో మొత్తం 17 ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు ఉండగా, మిగిలినవి అనుబంధ ప్రశ్నలు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
'సమగ్ర కులగణన అన్ని పథకాలకు మెగా హెల్త్ చెకప్‌లా ఉపయోగపడుతుంది'
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే - ఆ పత్రాలన్నీ దగ్గర ఉంచుకోండి