Gutha Sukender Reddy On BRS Lok Sabha Ticket 2024 : పార్టీ ఆదేశిస్తే తన కుమారుడు లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) పోటీ చేస్తారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించిన ఆయన మరో మూడు, నాలుగు రోజుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేయడం వేరని, ఇప్పడు వేరని అన్న ఆయన, రాజకీయాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి ఎవరూ ఉండరని అన్నారు.
'అధికారంలో లేనప్పుడు పోటీ చేసి కేడర్‌ను కాపాడుకోవాలన్నదే మా ఆలోచన. 2027 నవంబర్ వరకు నా పదవీ కాలం ఉంది, ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచిస్తాను. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ ఉంటుంది. కేటీఆర్ కలిసినపుడు అమిత్ రెడ్డికి టికెట్ అంశం చర్చకు వచ్చింది. మూడు, నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుంది. అందరికీ సంతృప్తి, వ్యతిరేకత ఉండదు.' అని గుత్తాసుఖేందర్ రెడ్డి అన్నారు.
'తల్లిలాంటి పార్టీని కాపాడుకుంటూ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలి'
Gutha Sukender Reddy Fires on Congress : ప్రస్తుతం పార్టీని( BRS), కేడర్‌ను కాపాడుకోవడం ప్రధాన సమస్యని గుత్తా అన్నారు. గాలి వచ్చింది పార్టీ ఓడిపోయిందని, వాతావరణం తప్ప ఓటమికి ఎవరో వ్యక్తులు కారణం కాదని తెలిపారు. అమిత్ రెడ్డి జిల్లా నేతలను అందరినీ కలిశారని చెప్పారు. నల్గొండ, భువనగిరిలో ఎక్కడ అవకాశం ఇచ్చినా అక్కడ పోటీ చేస్తారని పేర్కొన్నారు. పార్టీ అన్ని అంశాలు చూసుకుంటుందన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా సీఎం, మంత్రులు చేయాల్సిన పనులు చేయాలన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులను సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి పంపుతానని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణుల సమాయత్తం - వచ్చే నెలలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భేటీలు
"మండలి డిప్యూటీ ఛైర్మన్ సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి నేతృత్వం వహిస్తారు, కమిటీ ఏర్పాటు కాలేదు. కృష్ణా బోర్డు పరిధిలోకి శ్రీశైలం, సాగర్ పోతే తెలంగాణకు గొడ్డలి పెట్టు. నల్గొండ, పాలమూరు ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. కృష్ణా జలాలు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. నదీ జలాలు ప్రధాన అంశంగానే తెలంగాణ ఉద్యమం జరిగింది. ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి పోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి . నీటిపారుదల శాఖ చూస్తున్నారు, పూర్తి బాధ్యత తీసుకొని త్వరగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించాలి" - గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ మండలి ఛైర్మన్