Nagarjuna Developed Water Sensor : ప్రస్తుత కాలంలో నీటి వృథాను అరికట్టడం తప్పనిసరిగా మారింది. ప్రజల్లో అవగాహనతో పాటు నీటి సంరక్షణకు సాంకేతికత అవసరం కూడా ఏర్పడింది. మన ఇంట్లో మోటార్ వేస్తాం ట్యాంక్ నిండిన తర్వాత ఆపేయటం మర్చిపోతాం. దీంతో నీరు వృథా అవుతుంది. ఈ ఇబ్బందికి సరికొత్తగా ఏఐతో పరిష్కారం చూపాడు ఈ వ్యక్తి. ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల నుంచి అవార్డులతో పాటు ఆవిష్కరణలకు పేటెంట్ కూడా పొందారు.
నాగార్జునది గుంటూరు స్వస్థలం. ఆర్థిక పరిస్థితులు, కెరీర్ గురించి చెప్పే వారు లేక ఇంటర్మీడియట్‌లో హెచ్ఈసీ చదివాడు. అయితేనేం చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ వస్తువులపై ఆసక్తి కనబరిచాడు. సామాజిక మాధ్యమాలను వారధిగా చేసుకుని నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నాడు. ఆ తర్వాత దూరవిద్యలో ఎంసీఏ పూర్తి చేసి తన కెరీర్‌కు వినూత్నంగా బాటలు వేసుకున్నాడు.
AI Sensor to Curb Water Wastage : ఒక రోజు తాను ఉంటున్న ప్రాంతంలోని ఇళ్లపై నుంచి ట్యాంకులు ఓవర్ ప్లో అవ్వడాన్ని గమనించాడు నాగార్జున. ఓ స్నేహితుడు దీనికి ఏమైనా పరిష్కారం కనుగొనచ్చు కదా అని సలహా ఇచ్చాడు. తనకూ ఆ ఐడియా నచ్చడంతో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే ఇప్పటికే మార్కెట్లో కొన్ని రకాల సెన్సార్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో లేని మరికొన్ని ప్రత్యేక సదుపాయాలను పొందుపరుస్తూ తక్కువ ధరకు ఈ సెన్సార్ పరికరాన్ని అందివ్వాలని ప్రయత్నాలు చేశాడు.
ఇందుకోసం ఏఐ సాయంతో తక్కువ వ్యయం, ఎక్కువ కాలం పని చేసే సెన్సార్‌కు రూపకల్పన చేశాడు నాగార్జున. అదనపు ప్రయోజనాలు చేకూర్చేలా గుంటూరులో వినియోగంలోకి తెచ్చాడు. మున్సిపాలిటీ నీరు విడుదలైనప్పుడే సెన్సార్లు యాక్టివేటై మోటార్ ఆన్ అయ్యేలా డిజైన్ చేశాడు. సంపు లేదా ఓవర్ హెడ్ ట్యాంకు, మోటార్ ఇలా ఎక్కడ అవసరమనుకుంటే అక్కడ ఈ పరికరాలను అమర్చి పని చేయిస్తాడు. సెన్సార్లను నియంత్రించేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించాడు.
"ఐవోటి ద్వారా వీటిని అనుసంధానం చేయడం జరిగింది. నీరు విడుదల కాగానే సెన్సార్లు యాక్టివేట్ అవుతాయి. తద్వారా మోటారు ఆన్ అవుతుంది. ట్యాంక్ నిండగానే మోటార్ ఆఫ్ అవుతుంది. కొన్ని చోట్ల మోటార్లకు పర్మిషన్ ఉండదు. అక్కడ స్మార్ట్ ట్యాప్‌లను ఏర్పాటు చేశాం. కొన్ని సార్లు ఎయిర్ లాక్ అయినప్పుడు వాటిని సాల్వ్ చేసే విధంగా ఏఐ సాయంతో డిజైన్ చేశాం." - నాగార్జున, ఆవిష్కర్త
అమెరికాలో ఉన్నా యాప్ ద్వారా నియంత్రించేలా డిజైన్ చేశారు నాగార్జున. ఇది 12 సంవత్సరాల పాటు ఎలాంటి రిపేర్ లేకుండా పని చేస్తుందని చెబుతున్నాడు. 2014లో పేటెంట్ కోసం దరఖాస్తు చేయగా 2023 డిసెంబర్లో పేటెంట్ వచ్చింది. పదేళ్ల పాటు ఈ పరికరాల పనితీరు, నాణ్యతా ప్రమాణాలు పరిశీలించిన తర్వాత మాత్రమే ఇది మంజూరయిందని నాగార్జున అంటున్నాడు. అతను రూపొందించిన ఈ వెదర్ ప్రూఫ్ లిక్విడ్ లెవల్ స్విచ్ అండ్ ఇండికేటర్‌కు ఇన్ఫోసిస్ సంస్థ 2016లో మేకర్స్ ఇండియా అవార్డు ప్రకటించింది. రూ. 5 లక్షల నగదు బహుమతి అందించింది.
నీటి వృథా లేకుండా పోయింది : అందరిలా రూపొందించి పరికరాన్ని విక్రయించటం కాకుండా ఎవరికి కావాలంటే వారికి అద్దెకు ఇచ్చేలా నాగార్జున ప్లాన్ చేశాడు. ఇంటి యజమానుల అవసరాన్ని బట్టి 2 నుంచి 5 రూపాయల రోజువారి అద్దెపై వీటిని ఏర్పాటు చేశాడు. ఈ పరికరాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత తమకు ఇబ్బందులు తప్పాయని వినియోగదారులు అంటున్నారు. నీటి వృథా లేకుండా పోయిందని చెబుతున్నారు.
విస్తృత స్థాయిలో ఉపకరణాల తయారీ కోసం లెవెల్జాన్ పేరుతో అంకురాన్నిఏర్పాటు చేశాడు నాగార్జున . అందులో యువతకు ఉపాధి కల్పిస్తున్నాడు. ఇప్పుడు డ్రైవర్ లేకుండా నడిచే వాహనాన్ని రూపొందించే పనిలో నిమగ్నమయ్యాడు. దీనికోసం ఓ ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసి దాన్ని డ్రైవర్ లేకుండా నడిచేలా సాంకేతికత అభివృద్ధి చేస్తున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్టుని కూడా పూర్తి చేస్తానని విశ్వాసంతో నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నాడు.
Vizag Swetha Interview: పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పది మందికి ఆదర్శంగా నిలుస్తున్న యవతి