Inspirational Story Of Lady Magician In AP : ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపుతూ, ‘మాయా లేదు మంత్రం లేదు’ అంటూ మ్యాజిక్ చేయడం అందరికీ సాధ్యం అయ్యేపని కాదు. అలాంటి విద్యలో మహిళలు రాణించడం చాలా అరుదు. కానీ ఆ రంగాన్నే ఎంచుకొని దూసుకుపోతున్నారు తణుకుకు చెందిన దండా లక్ష్మీదేవి ప్రసన్న. ఆ విశేషాలేంటో ఆమె మాటల్లోనే చెబుతున్నారిలా.
'బంధువుల అబ్బాయి రాముతో 2011లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. మావారు వృత్తిరీత్యా ఈవెంట్ ఆర్గనైజర్. దాదాపు 20 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. పాటలు పాడటం, డ్యాన్స్ నేర్పించడం వంటివీ చేస్తుంటారు. అలాగే మెజీషియన్ కూడా. అందరూ ‘ఆల్‌రౌండర్ రాము’ అనీ పిలుస్తారు. ఆయన స్ఫూర్తితో పాటలు పాడటం నేర్చుకున్నా. అలాగే కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగానూ చేశా. ఒకసారి మావారితో కలిసి కేరళలో మ్యాజిక్ పోటీలకు వెళ్లా. అప్పుడు ఆసాంతం చూస్తూ మైమరచిపోయారు ప్రేక్షకులంతా. ఈలలూ, చప్పట్లతో మా వారిని ప్రశంసించారు.
ఆ పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్నవారంతా పురుషులే, మహిళలు ఒక్కరు కూడా లేరు. నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని చిన్నప్పట్నుంచీ అనుకునేదాన్ని. అందుకు మ్యాజిక్ సరైనదిగా అనిపించింది. నేర్చుకుంటానని మావారికి చెబితే ప్రోత్సహించి శిక్షణ ఇచ్చారు. మ్యాజిక్ అంటే ప్రేక్షకుల్ని మాటల్లో పెట్టి ఏదో ఒకటి చెబుతూ, చేస్తూ, చేయిస్తూ భ్రమలో నింపాలి. అలాగే వారితో కేరింతలు, చప్పట్లు కొట్టించాలి. నవ్వించాలి, అదేవిధంగా ఆశ్చర్యంలో ముంచెత్తాలి. దీనికి చాలా ఏకాగ్రత, శ్రద్ధ అవసరం. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సభలో నవ్వుల పాలవుతాం. అందుకోసం నిత్యం ప్రాక్టీసు చేస్తూ ఉంటా. చేసినవే మళ్లీ చేస్తే చూసేవాళ్లకే కాదు, నాకూ బోర్ కొట్టేస్తుంది. అందుకే కొత్తవాటిని తరచూ ప్రయత్నిస్తా.
ఇందులో మెంటలిజం- ప్రేక్షకులు మనసులో తలచుకున్న అంకెను చెప్పడం, మ్యాజిక్ కంజ్యూరింగ్- వస్తువుల్ని అక్కడ నుంచి మాయం చేయడం, పుట్టించడం, హెల్యూజనేషన్- మనిషిని రెండు భాగాలు చేసినట్టు వారికి భ్రమ కల్పించడం. ఇలా రకరకాల ట్రిక్‌లతో ఒక షో రెండు గంటల పాటు సాగుతుంది. అయిదు అంగుళాల నిజమైన మేకును సుత్తితో కొట్టి ముక్కులో పెట్టుకోవడమనేది జాతీయస్థాయిలో ఏడుగురు మెజీషియన్లు మాత్రమే చేస్తుండగా అందులో నేను ఏకైక మహిళను.
చదువుతో పాటే ఉద్యోగాల వేట - ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటేలా శిక్షణ - Campus Recruitment Training
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 300కుపైగా ప్రదర్శనలిచ్చాను. గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్ పోటీల్లో 2023లో ప్రథమ, 2024లో తృతీయ స్థానాల్లో గెలిచాను. అలాగే తాజ్ మ్యాజిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఉత్తర్‌ప్రదేశ్, ఆగ్రాలో ఈ సెప్టెంబరులో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి గెలుచుకున్నా. పెళ్లి తర్వాత పిల్లలూ, కుటుంబమే కాదు ఉద్యోగ, వృత్తి జీవితాన్నీ నిర్మించుకోవచ్చు. కృషి, పట్టుదల, శ్రమ చేయాలనే తపన తోడైతే మీ జీవితంలోనూ ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది' అని దండా లక్ష్మీదేవి ప్రసన్న వివరించారు.