Hanuman Shobha Yatra on Jayanthi : రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆంజనేయ స్వామి శోభాయాత్ర భక్తుల మధ్య కోలాహలంగా జరిగింది. భాగ్యనగరంతో పాటు పలు జిల్లాలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని జై హనుమాన్ నామస్మరణతో మార్మోగించారు. హనుమాన్ శోభాయాత్రలో యువతతో పాటు చిన్నపిల్లలు సైతం ఉత్సాహంగా పాల్గొని కనుల పండువగా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య యాత్ర కొనసాగింది. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు.
కాషాయ జెండాలు చేతబూని యువత ఉత్సాహంగా ముందుకు కదిలారు. కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయం నుంచి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయ యాత్ర పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజల అనంతరం ర్యాలీ ప్రారంభించారు. ఈ యాత్రలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో పాటు వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ సభ్యులు, హిందూ వాహినీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తాడ్‌బండ్ వరకు సాగిన శోభాయాత్రలో అడుగుగడుగునా జై హనుమాన్ నామస్మరణ మారుమోగింది.
వీర హనుమాన్ విజయయాత్ర : శంషాబాద్‌లో నిర్వహించిన శోభాయాత్రలో చేవేళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్‌లో హనుమాన్ శోభాయాత్రకు ఎంపీ అర్వింద్ హాజరయ్యారు. నగరంలోని కంఠేశ్వర్ వద్ద వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయయాత్రను జెండా ఊపి ఎంపీ అర్వింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ బాలుడితో కలిసి ఎంపీ అర్వింద్ ఉత్సాహంగా నృత్యం చేశారు. ఎంపీ అర్వింద్ నృత్యం చేయడం అందరినీ ఉత్సాహ పరిచింది.
పండ్లు, మజ్జిగ పంపిణీ : హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న వారికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జీవన్‌రెడ్డిలు పండ్లు, మజ్జిగ, మంచి నీళ్లు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మహబూబాబాద్ వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి గాయత్రి దేవాలయం వరకు శోభాయాత్రను నిర్వహించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలోని వీధులు శోభయాత్రను పురస్కరించుకుని జై హనుమాన్ నామ స్మరణతో మార్మోగాయి.
ఆ ఊళ్లో వీధికో హనుమాన్ ఆలయం - ఇంతకీ ఎందుకలా? - 50 Hanuman Temples in Vellulla