Govt School Students English Talent in Khammam District : ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం పిండిప్రోలు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆంగ్లంలో నాటికలు వేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇంగ్లీష్‌లో డైలాగులు చెబుతూ చక్కని అభినయంతో నాటికలు ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదవడమే కష్టంగా ఉంటుందని భావించే వారికి చక్కని తర్ఫీదు ఇస్తే తాము ఎందులో తక్కువ కాదని నిరూపిస్తున్నారు.
ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లల్లో ఇంగ్లీష్ పట్ల భయం తొలగించేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్పెల్ విజార్డ్, నాటికలు వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు నిర్మల తొమ్మిదో తరగతి విద్యార్థులను ఎంపిక చేసుకుని ఆంగ్లంపై తర్ఫీదు ఇచ్చారు. 10వ తరగతి ఆంగ్ల పాఠం అట్యీటూడ్ ఈస్ అల్టీట్యూడ్‌లోని ప్రధాన పాత్రధారి నిక్ చరిత్రను కథగా ఎంచుకుని విద్యార్థులతో ఒక డ్రామాలా రాయించి వారికి అందులో శిక్షణ ఇచ్చారు.
12th Fail ఇంగ్లిష్ టీచర్- ఇన్‌స్టాలో క్లాస్‌లు సూపర్ హిట్- భారీగా ఆదాయం!
Khammam Students Excelling in English : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పిండిప్రోలు విద్యార్థులు ప్రదర్శించిన నాటిక మొదటి స్థానం గెలుచుకుంది. తాము ప్రదర్శించిన డ్రామా ఉత్తమ ప్రదర్శనగా నిలవడం పట్ల విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ప్రదర్శనకు మంచి పేరు వస్తుందని కానీ, పైస్థాయిలో ప్రదర్శనలకు తీసుకువెళ్లాలంటే ఆర్థిక భారం ఎక్కువగా ఉందని ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి సుజాత చెబుతున్నారు. వారి ఖర్చులకు దాతలు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.
"9వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి ఆంగ్లంలో శిక్షణ ఇచ్చాను. 10వ తరగతి ఆంగ్ల పాఠం అట్యీటూడ్ ఇస్ అల్టీట్యూడ్‌లోని ప్రధాన పాత్రదారి నిక్ చరిత్రను కథగా ఎంచుకుని ఒక డ్రామాలా విద్యార్థుల చేత రాయించాను. ఒక పది నిమిషాల వ్యవధిలో ఉండేలా డైలాగులు రాశారు. అందుకనుగుణంగా విద్యార్థినులకు శిక్షణ ఇచ్చాను. ఆంగ్ల ఉచ్ఛారణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారితో అభ్యసన చేయించాను. గొప్ప వ్యక్తిత్వ వికాస కథగా చెప్పుకునే నిక్ జీవిత చరిత్ర నాటకాన్ని మా విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు." - నిర్మల, ఆంగ్ల ఉపాధ్యాయురాలు
"మా ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో నిక్ నాటకాన్ని రాశాం. అందులో మా పాత్రలకు తగ్గట్లుగా మా ఉపాధ్యాయురాలు తగిన శిక్షణ ఇచ్చారు. ఆ నాటకాన్ని జిల్లా స్థాయిలో ప్రదర్శించి మొదటి స్థానం సంపాదించుకున్నాం. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టించి మా పాఠశాలకు పేరు తీసుకొస్తాం." - విద్యార్థినులు
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు సరిగా చదవరని, ఆంగ్లంలో వెనుకబడి ఉంటారనే అభిప్రాయాలను ఈ విద్యార్థులు పటాపంచలు చేస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని అంటున్నారు. అంతేకాక ఇతర ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు పిండిప్రోలు విద్యార్థులు.
పల్లెటూరి మేడమ్ ఇంగ్లిష్ పాఠాలు- యూట్యూబ్ ద్వారా నెలకు రూ.లక్షల్లో ఆదాయం!