Govt Special Focus On Kharif Crops : రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ పంటల ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. వాతావరణం అనుకూలంగా ఉంటుందన్న భారత వాతావరణ కేంద్రం సంకేతాల నేపథ్యంలో మొత్తం 1 కోటి 34 లక్షల 35 వేల 175 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేయాలని అంచనా వేసింది. రైతుల సౌకర్యార్థం క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులు, ఇతర అన్ని రకాల ఉపకరణాలు అందుబాటులో పెడుతోంది.
ప్రధాన ఆహార పంట వరి 66 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులను వ్యవసాయ శాఖ సమాయత్తం చేస్తోంది. రాష్ట్రంలో 60.53 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దానికి సరిపడా బోల్‌గార్డ్-2 విత్తనాలు మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈసారి బోల్‌గార్డ్-2 పత్తి విత్తన ప్యాకెట్ గరిష్ఠ ధర రూ. 864 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఏ ఒక్క డీలరైనా అంత కంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. అధీకృత డీలర్ వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రాములు సూచించారు.
ఖరీఫ్ పంట చివరి తడికి నీళ్లు అందించాలి - అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం
Kharif Crops In Telangana : ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు సాధారణ సమయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం మొక్కజొన్న 6 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు కానుంది. కంది 5.65 లక్షల ఎకరాల్లో సాగు కానుంది. సోయాబీన్ 4.96 లక్షల ఎకరాల్లో సాగు కానుంది. పెసర 56 వేల ఎకరాలు, జొన్న 38 ఎకరాలు, వేరుశనగ 23 వేల ఎకరాలు, మినుము 20 వేల ఎకరాలు, ఆముదం 3500, సజ్జ 1000 ఎకరాల చొప్పున పంట సాగు కానున్నాయి.
రైతుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా వ్యవసాయ పంటలకు అవసరమైన రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు సైతం సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకించి మునుపెన్నడూ లేని రీతిలో యూరియా 6.24 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 76 వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 3.77 లక్షల మెట్రిక్ టన్నులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 24 వేల మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 14 వేల మెట్రిక్ టన్నులు మేర వ్యవసాయ శాఖ అందుబాటులో పెట్టింది. భూ సారం పెంపుతో పాటు కర్భన శాతం పెంపొందించుకునేందుకు రైతులు రసాయన ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులు కూడా 60:40 నిష్పత్తిలో వాడుకోవాలని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 24వ తేదీన రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో "విత్తన మేళా" జరగనుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా విత్తన పంపిణీ చేస్తారు. అలాగే, అదే రోజు వరంగల్, పాలెం, ఆదిలాబాద్, జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంతోపాటు ఇతర కృషి విజ్ఞాన కేంద్రాల ప్రాంగణాల్లో ఈ మేళాలు జరనున్నాయి. వివిధ పంటలకు సంబంధించి నాణ్యమైన విత్తన రకాలు విక్రయానికి అందుబాటులో ఉంచడంతోపాటు పైర్ల సమగ్ర సమాచారంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించనున్నారు.
Kishanreddy on Crops MSP Hike in Telangana : 'యూపీఏతో పోలిస్తే పంటలకు మద్దతు ధరలు భారీగా పెంచాం'