Invitation to KCR for Telangana decade celebrations : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ ఆర్విందర్ సింగ్ బంజారాహిల్స్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందించారు. ఆహ్వాన పత్రికతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన ప్రత్యేక లేఖను కూడా కేసీఆర్‌కు ఇచ్చారు.
TG Formation Day Invitation To KCR : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్‌ను ఆహ్వానించామన్న వేణుగోపాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ను భాగస్వామ్యం కావాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అందరికీ పండుగ అని, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించారన్న వేణుగోపాల్, వేడుకల్లో కేసీఆర్ భాగస్వామ్యమవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
జూన్ రెండో తేదీన పండగ వాతావరణంలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలిసి సీఎం లేఖ, ఆహ్వానపత్రాన్ని అందించాము. వేడుకల్లో భాగస్వామ్యం కావాలని ఆయనను కోరాము. ఆయన సానుకూలంగా స్పందించారు - హర్కర వేణుగోపాల్, ప్రోటోకాల్ ఛైర్మన్
మాజీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించిన వేణుగోపాల్ : అంతకు ముందు రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించేందుకు ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరారు. అనంతరం ఆయనను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న వేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్‌ను స్వయంగా కలిసి ఆహ్వానపత్రం ఇవ్వాలని హర్కర వేణుగోపాల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు చకచకా ఏర్పాట్లు : రాష్ట్ర దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లను చేస్తోంది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సోనియాగాంధీని హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.