Government Serious on Illegal Sand Mining in NTR District : ఎన్టీఆర్ జిల్లాలో అక్రమ మట్టి దందాను మైనింగ్ అధికారులు నిగ్గు తేల్చారు. ఐదేళ్లలో అక్రమ మట్టి తవ్వకం మొత్తం 10.54 లక్షల క్యూబిక్ మీటర్లగా అధికారులు తేల్చారు. దీని విలువ రూ. 90.39 కోట్లని సమాచార హక్కు చట్టం సాక్షిగా వెల్లడించారు. కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు ప్రాంతాల్లో భారీగా అక్రమ క్వారీయింగ్ జరిగిందని గుర్తించిన అధికారులు కేవలం రూ. 90.39 కోట్ల వసూలుకు డిమాండ్ నోటీసులు జారీ చేయడం చర్చాంశనీయంగా మారింది. గత ఐదేళ్లలో 515 కేసులు జిల్లాలో నమోదు చేసినట్లు చెబుతున్నారు. దీనిలో 175 మందికి అక్రమ తవ్వకాల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
ఎన్టీఆర్ జిల్లాలో అక్రమమట్టి దందా తవ్వేకొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సమాచారహక్కు చట్టం కింద కొత్తూరు తాడేపల్లికి చెందిన మెండెం జములయ్య అనే వ్యక్తి అడిగిన సమాచారానికి గనులు, భూగర్భ గనుల శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌కుమార్ బదులు ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో ఉన్న విజయవాడ గ్రామీణ మండలంలోని పలు గ్రామాల నుంచి విచ్చలవిడిగా తవ్వకాలు జరిగినట్లు వెల్లడించారు.
ఇటీవల వరకు ఈ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అదేమని గ్రామస్తులు అడ్డుకుంటే జగనన్న కాలనీల మెరక పేరుతో తహశీల్దారు జారీ చేసిన లేఖలు చూపించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. వాస్తవానికి ఎలాంటి తవ్వకాలు జరపాలన్నా, గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సిందే. పాతపాడు పరిధిలో నలుగురు ప్రైవేటు వ్యక్తులకు లీజులు మంజూరు చేసిన గనుల శాఖ ఎంత పరిమాణం అనేది పేర్కొనలేదు. మిగిలిన ప్రాంతాల్లో మూడు లీజులు విజయవాడ బైపాస్ రహదారి నిర్మాణం చేస్తున్న ప్రైవేటు సంస్థకు తాత్కాలికంగా ఇచ్చిన అనుమతులే.
నైనవరంలో ఒకే ఒక్క అనుమతి ఇచ్చారు. కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు, పాతపాడు, పోలవరం కాలువ కట్టలపై, అటవీశాఖ భూముల్లో కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఘనపరిమాణంలో మట్టి తవ్వకాలు జరిగాయి. నాటి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములుగా మట్టి వ్యాపారం చేశారు. నాడు తాత్కాలిక అనుమతులు తీసుకున్నామని, జలవనరుల శాఖ పోలవరం విభాగం ఇంజినీర్లు అనుమతులు ఇచ్చారని పలువురు యధేచ్ఛగా తవ్వకాలు జరిపారు. కానీ అవన్నీ ఉత్తవేనని సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న సమాచారంలో తేటతెల్లమైంది.
యురేనియం అనుమతులు రద్దు చేయకపోతే ఉద్యమిస్తాం - 15 గ్రామాలు హెచ్చరిక
అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో కేసు దాఖలు కాగా విచారణకు వచ్చిన ఐఏఎస్ అధికారులపై దాడి చేశారు. కనీసం పోలీసు కేసు నమోదు చేసేందుకు సైతం పోలీసులు ముందుకు రాలేదు. ఎన్‌జీటీకి తప్పుడు నివేదికలు అందించారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోనూ కేసు దాఖలైంది. అటవీశాఖ పలుమార్లు స్వ్కాడ్‌ను పంపి విచారణ నిర్వహించింది. దీంతో కింది స్థాయి సిబ్బందిపై సాధరణ చర్యలు తీసుకుని విచారణను మమ అనిపించారు. నాటి ఘటనపై అక్రమ మైనింగ్ జరిగినట్లు తాజాగా అటవీ శాఖ ధ్రువీకరించింది. దీంతో కొత్తూరు తాడేపల్లి, వేమవరం, పోలవరం కాలువ పరిధిలో 86 మందిపై కేసులు పెట్టారు.
10లక్షల 54వేల 72 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వకానికి 59 కోట్ల 8 లక్షల 43వేల 40 రూపాయలు జరిమానా విధించారు. వెలగలేరు గ్రామ పరిధిలో 89 మందిపై కేసులు నమోదు చేయగా 5 లక్షల 65వేల 352 ఘనపు మీటర్ల అక్రమ మట్టి తవ్వకానికి 31కోట్ల 30 లక్షల 75 వేల 359 రూపాయలు జరిమానా విధించారు. మొత్తం 2019 నుంచి 2024 వరకు 175 కేసులు నమోదు చేసిన గనుల శాఖ 175 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చి 90.39కోట్ల జరిమానా విధించింది. ఇవి ఇంకా వసూలు కావాల్సి ఉంది. గోతుల్లో పడి ఓ వ్యక్తి చనిపోగా, ఐదు గేదెలు మృతిచెందాయి. అక్రమమట్టి తవ్వకాలకు అక్కడ ఏర్పడిన భారీ గుంతలే ఉదాహరణగా నిలుస్తున్నాయి.
గుట్టను కొల్లకొట్టేందుకు అవకాశం కల్పించారు. వీటిపై సమగ్ర విచారణ చేయాలని జములయ్య చేసిన ఫిర్యాదు చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే గనుల శాఖ ఇచ్చిన సమాచారం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. వందల కోట్ల మట్టి తవ్వకం జరిగితే కేవలం 10.54లక్షల క్యూబిక్ మీటర్లే అక్రమ తవ్వకం జరిగినట్లు నివేదించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు - గనుల శాఖ ఉత్తర్వులు