Government Liquor Shops Scams in Ongole : వైఎస్సార్సీపీ హయాంలో నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో గోల్‌మాల్ జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా 2 ఎలైట్ మాల్స్‌తో పాటు 14 దుకాణాల్లో సుమారు రూ. 5 కోట్ల మేర నగదును మెక్కేసిన విషయాన్ని అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మార్నేని రమణతో పాటు కొందరు దుకాణ సిబ్బంది పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎప్పటికప్పుడు జమా లెక్కలు తేల్చాల్సిన నాటి అధికారులు తమ బాధ్యత విస్మరించారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
చేతులు కాలాక ఆకులు : ఒంగోలులోని 2 మాల్స్‌తో పాటు, 14 దుకాణాల్లో సుమారు రెండేళ్లుగా అక్రమం వ్యవహారం నడుస్తున్నా అధికారులు గుర్తించలేకపోయారు. మద్యం దుకాణాల పర్యవేక్షణ బాధ్యత హెడ్ కానిస్టేబుల్‌దే అయిన్పటికీ వాటిని ఎస్సై, సీఐ స్థాయి అధికారులు నిర్ణీత కాల వ్యవధిలో పరిశీలించాల్సి ఉంటుంది. ఏమైనా అక్రమాలు జరిగినట్లు అనుమానం వస్తే తక్షణం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. ఈ భారీ కుంభకోణంలో ఎక్సైజ్ అధికారులు (Excise officers) అందుకు భిన్నంగా వ్యవరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు కనీసం తనిఖీలు చేపట్టిన దాఖలాలు కూడా లేవు.
" జే " బ్రాండ్లకు చెల్లు- ఇక కోరుకున్న మందు- నాలుగు బ్రాండ్ల క్వార్టర్ ధర రూ. 99
ఇప్పుడు అధికారులు మేల్కొని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా మారింది. అయినా ఎక్సైజ్ శాఖ దర్యాప్తులో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. కుంభకోణం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు నిధుల గోల్‌మాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శాఖాపరంగా అంతర్గత విచారణ చేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ ఒక్కరే ఈ వ్యవహారంలో సూత్రధారిగా వ్యవహరించారా? దుకాణాల సిబ్బంది పాత్ర ఎంత మేరకు ఉందనే విషయంపై ఆరా తీస్తున్నారు. వీరిలో ఒక మాల్ సూపర్‌వైజర్‌గా వ్యవహరించిన వ్యక్తి గత కొన్నాళ్లుగా విధులకు గైర్హాజరైనట్లు పోలీసులకు తెలిసింది.
మద్యం దుకాణాలపై మహిళల ఆసక్తి - కేటాయింపు ప్రక్రియ పూర్తి
ఆలస్యం నిందితులకు అవకాశం : ఎలైట్ మాల్‌లో పనిచేసే సిబ్బంది కొద్ది రోజుల కిందటే ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ను కలిసి మద్యం దుకాణల్లో భారీ కుంభకోణంపై ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో తాలూకా పోలీసులు ఈ విషయంలో విచారణ చేపట్టారు. కానీ ఇక కేసు నమోదు చేయలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రమణను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు విచారించారు. ఎక్సైజ్ సీఐ నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. అనంతరం కొద్ది సేపటికే రమణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరో వైపు మంగమూరు రోడ్డులోని మాల్ సిబ్బంది ఓ న్యాయవాదిని ఆశ్రయించారు. ఈ బాగోతంలో మాల్స్ సిబ్బంది పాత్ర కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మద్యం దుకాణాలకు వేళాయె - లెక్క తేలింది కిక్కు ఎవరికో!
మాల్‌లో పనిచేసే కొందరు ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం కేసు నమోదు చేయకుండా ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదు కోసం వేచి చూశారు. ఇదే అదునుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు మాల్స్, దుకాణాల్లో పనిచేసి చేతివాటం ప్రదర్శించిన వారు మాత్రం న్యాయవాదిని
(Lawyer) ఆశ్రయించారు. ఇక ఎక్సైజ్ అధికారులు అంతర్గత విచారణ ఎప్పటికి పూర్తిచేస్తారు. అధికారులు నిందితులపై ఎన్నాళ్లకు చర్యలు తీసుకుంటారో అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ షేక్ ఖాజామొహియుద్దీన్ మాత్రం ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి తాము పోలీసులకు నివేదిక ఇస్తామనీ వెల్లడించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
ఏపీలో మద్యం దుకాణాలకు 90వేల దరఖాస్తులు! - అత్యధికంగా ఆ జిల్లా నుంచే