Vakka industry In Satya sai District : ప్రత్యేకమైన వాతావరణంలో మాత్రమే అరుదుగా సాగుచేసే వక్క తోటలకు శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా ఉంది. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న మడకశిర నియోజకవర్గంలో మూడు మండలాల్లో వక్క సాగు పెద్దఎత్తున జరుగుతోంది. దశాబ్దాల కాలంలో అక్కడి రైతులు వక్క సాగుచేస్తూ పంట దిగుబడిని కర్ణాటక రాష్ట్రంలో విక్రయిస్తున్నారు. వక్క తోటలకు అనుబంధంగా విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడంతో పాటు, రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని చాలా కాలంగా అక్కడి రైతులు ప్రభుత్వాలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆగస్టులో సీఎం చంద్రబాబు మడకశిర పర్యటనకు వచ్చినపుడు వక్క సాగుచేస్తున్న ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తామని, ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అమరాపురుంలో వక్క ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వ భూమి కేటాయింపు కోసం తహసీల్దార్ జిల్లా అధికారులకు నివేదిక పంపించారు.
రైతులను వంచిస్తున్న దళారులు: శ్రీ సత్యసాయి జిల్లాలో మూడు మండలాల్లో పదిహేను వేల ఎకరాల్లో విస్తరించిన వక్క తోటల రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే ఈ ప్రయత్నం జరగ్గా ఈ అంశాన్ని చరుకుగా ముందుకు తీసుకెళ్లడంలో స్థానిక నాయకులు విఫలం అయ్యారు. ఈ ప్రాంతంలో వచ్చిన వక్క దిగుబడులను రైతులు అత్యంత వ్యయ ప్రయాసలతో కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని మార్కెట్ లకు తరలించి విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని వ్యాపారులు, దళారులు వక్క రైతులను మోసం చేసి డబ్బు ఎగ్గొట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయి. రెండేళ్ల క్రితం రైతుల నుంచి ఉత్పత్తి కొనుగోలు చేసిన ఓ దళారి పంటను అమ్ముకొని కోట్ల రూపాయలతో పారిపోయాడు. ఈ సంఘటనకు రైతులు రైతు ఉత్పత్తి సంఘంగా ఏర్పడి కర్ణాటక మార్కెట్లో విక్రయాలు చేస్తున్నారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులు పంటను కర్ణాటక మార్కెట్ కు తరలించి విక్రయించడం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితి. అయితే ఈ ఏడాది ఆగస్టులో సీఎం చంద్రబాబు మడకశిరకు వచ్చినపుడు వక్క ప్రాసెసింగ్ పరిశ్రమ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది.
ఉద్యోగ- ఉపాధి అవకాశాలకు ఆస్కారం: మడకశిర నియోజకవర్గం నుంచి కర్ణాటక మార్కెట్ కు వెళుతున్న వక్కను దళారులు, వ్యాపారుల ద్వారా ముంబై, దిల్లీలోని వక్క ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమలకు వెళుతోంది. అందువల్ల ఈ తరహా పరిశ్రమలు మడకశిర ప్రాంతంలో ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అక్కడి వక్క రైతులు చాలా కాలంగా ప్రభుత్వాలను కోరుతున్నారు. వక్క చెట్ల నుంచి రాలిపోయిన ఆకులను తోటల నుంచి సేకరించి ప్లేట్ల తయారీకి వినియోగిస్తున్నారు. ఆహారం తినడానికి వినియోగించే పలు రకాల ప్లేట్లు, కప్పులు ఈ ఆకులతో తయారవుతున్నాయి. ప్రకృతి సిద్ధమైన ఆకులతో తయారవుతున్నందున దేశవ్యాప్తంగా ఈ ప్లేట్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ పరిశ్రమ అక్కడ ఐదు మండలాలతో కలిపి ఒకటి మాత్రమే ఉంది. అది కూడా ఓ పేద వ్యక్తి స్వయంగా ఏర్పాటు చేసుకొని నడుపుతుండగా దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదు.
''వక్క గెలలు వలిచి వక్కను షెల్ నుంచి వేరుచేసి ఉడికిస్తాం. ఈ ప్రక్రియ మేమంతా స్వయంగా చేసుకుంటాం. వక్కను ఉడికించినపుడు ఎర్రటి ద్రావకం వస్తుంది. దీన్ని వస్త్ర పరిశ్రమలో ప్రకృతి సిద్ధమైన రంగుగా వినియోగించే అవకాశం ఉంటుంది. వక్క చెట్ల నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తిని విలువ ఆధారితం చేసే పరిశ్రమలు మడకశిర ప్రాంతంలో ఏర్పాటు కావాలి. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చితే మాకు మేలు జరుగుతుంది '' - సంధ్య, వక్క ఆకు ప్లేట్ల పరిశ్రమ ప్రతినిధి
''అమరాపురం ప్రాంతం వక్క పరిశ్రమ హబ్ గా మారితే పరిసర ప్రాంతాలన్నీ ఎంతో అభివృద్ధి చెందుతాయి. సీఎం చంద్రబాబు హామీ మేరకు ప్రైమరీ ప్రాసెసింగ్ పరిశ్రమతో పాటు స్థానికంగా మార్కెట్ అందుబాటులోకి వస్తే మాకు అన్నివిధాలా మేలు జరుగుతుంది.''-లత, వక్క రైతు