Good News For Ration Card Holders : అవకతవకలకు తావులేకుండా రేషన్ లబ్ధిదారులకు ప్రతినెలా సక్రమంగా నిత్యావసర సరకులు అందించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అయిదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో భ్రష్టుపట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థను గాడినపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్టాక్ పాయింట్లలో తనిఖీలు నిర్వహించి కందిపప్పు, పంచదార ప్యాకెట్లకు సంబంధించి కొలతల్లో తేడాలను అధికారులు గుర్తించారు.
వాటి సరఫరా నిలిపివేసి కొత్తగా టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కొత్త ప్యాకింగ్‌తో వచ్చిన పంచదారను సెప్టెంబరు నుంచి రేషన్‌లో యథావిధిగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా పౌరసరఫరాల అధికారి విజయభాస్కర్ తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో నిలిపేసిన మిగతా సరకులను కూడా పేదలకు దశలవారీగా రేషన్‌లో అందించే దిశగా చర్యలు చేపడుతోంది.
రేషన్‌లో యథావిధిగా పంచదార పంపిణీ : ప్రభుత్వ ఆదేశాల మేరకు గత జూన్‌లో తూర్పుగోదావరి జిల్లాలో ఆయా ఎంఎల్‌ఎస్ (MLS) పాయింట్లలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. పంచదార అరకేజీ ప్యాకెట్‌లో 23 గ్రాములు, కందిపప్పు కేజీ ప్యాకెట్‌లో 53 గ్రాములు తక్కువ ఉన్నట్లు లీగల్ మెట్రాలజీ అధికారులు గుర్తించడంతో జిల్లావ్యాప్తంగా రేషన్‌లో ఆ రెండు సరకుల పంపిణీ నిలిపివేశారు. జులైలో మాత్రం పలు ప్రాంతాల్లో రేషన్ లబ్ధిదారులకు పంచదార పంపిణీ జరిగినా ఆగస్టులో పూర్తిగా ఆగిపోయింది.
ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు మళ్లీ 277 టన్నుల పంచదార కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. దీనిని ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి ఆయా చౌకధరల దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క రేషన్ కార్డుకు పంచదార ప్యాకెట్ (Half KG) చొప్పున 17 రూపాయలకు అందించనున్నారు. అదే అంత్యోదయ అన్న యోజన (AAY) కార్డుకు కేజీ 13 రూపాయలకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. కందిపప్పు మాత్రం ఇంకా అందుబాటులో రాలేదు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సంబంధించిన అధికారులు తెలిపారు.
ద్వారంపూడి అడ్డాలో రేషన్ మాఫియా - సూత్రధారులు, పాత్రధారులపై ఫోకస్ - RATION MAFIA IN KAKINADA
సరఫరా చేసిన సరకులివి : సెప్టెంబరు నెలకు సంబంధించి రేషన్ లబ్ధిదారులకు పంపిణీకి 8,500 టన్నుల పీడీఎస్ (PDS) బియ్యం, 277 టన్నుల పంచదార, 55 టన్నుల రాగులు కేటాయించారు. వీటిని జిల్లాలోని బొమ్మూరు, కోరుకొండ, బిక్కవోలు, నిడదవోలు, గోపాలపురంలలో ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి ఇప్పటికే చౌకధరల దుకాణాలకు సరఫరా దాదాపు పూర్తి చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబరు 1 - 17 వరకు ఎప్పటిలాగే ఎండీయూ(MDU) వాహనాల ద్వారా రేషన్ సరకుల పంపిణీ జరుగుతుందని చెబుతున్నారు.
అయిదు మండలాలకు రాగులు : రాగులు మాత్రం రాజమహేంద్రవరం అర్బన్, గ్రామీణం, రాజానగరం, గోపాలపురం, నిడదవోలు మండలాలకు పౌరసరఫరా అధికారులు కేటాయించారు. వీటిని తీసుకునేందుకు లబ్ధిదారుల నుంచి వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా ఇండెంట్ పెంచుతామని తెలియజేశారు. 1 కేజీ నుంచి 3 కేజీల వరకు ఉచితంగా రేషన్‌లో రాగులు తీసుకోవచ్చని తెలిపారు. రాగులు ఎన్ని కేజీలు తీసుకుంటే అన్ని కేజీలు బియ్యం తగ్గించి లబ్ధిదారులకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.